ఎక్కడుంటారో.. ఏం చేస్తారో..? | - | Sakshi
Sakshi News home page

ఎక్కడుంటారో.. ఏం చేస్తారో..?

Aug 19 2025 5:16 AM | Updated on Aug 19 2025 5:16 AM

ఎక్కడుంటారో.. ఏం చేస్తారో..?

ఎక్కడుంటారో.. ఏం చేస్తారో..?

వార్డు ఆఫీసర్లు ఉన్నట్లా..? లేనట్లా..? ఎనిమిది నెలల క్రితం నియామకం బల్దియా కార్యాలయంలో చోటు కరువు రూ.5లక్షలతో టెండర్లకు ఆహ్వానం అయినప్పటికీ మొదలుకాని పనులు

టెండర్లు పూర్తయ్యాయి

జగిత్యాల: మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో పౌరసేవలు పక్కాగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల వార్డు ఆఫీసర్లను నియమించింది. వీరు ప్రతిరోజు మున్సిపల్‌ కార్మికులతో సమావేశం కావడం.. పనులను పర్యవేక్షించడం.. నివేదికను ఉన్నతాధికారులకు చేరవేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే వార్డుస్థాయి పారిశుధ్య ప్రణాళిక అమలు, ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెస్‌, ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లు, మటన్‌, చికెన్‌ స్టాల్స్‌ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే వీరు విధుల్లో చేరి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఈ వార్డు ఆఫీసర్లు ఉంటారన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా ఉంది. జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలో 48వార్డులు ఉన్నాయి. ఇక్కడకు కొత్తగా 31 మంది వార్డు ఆఫీసర్లు వచ్చారు. గతంలో వీఆర్వోలుగా ఉన్న వారిలో కొందరిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. వారు విధుల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే వార్డులో వార్డు ఆఫీసర్‌ ఉన్నారని, ముఖ్యమైన పనులు వారు చూసుకుంటారన్న అవగాహన మాత్రం ప్రజల్లో లేకుండా పోయింది. ప్రజలు కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే.. వారు ఎక్కడుంటారో..? ఏం చేస్తారో..? కూడా తెలియడం లేదు. కనీసం మొబైల్‌ నంబర్‌ కూడా అందుబాటులో ఉండడంలేదంటే అతిశయోక్తికాదు.

చోటు కరువు..

జగిత్యాల మున్సిపాలిటీలో ఇప్పటివరకు వార్డు ఆఫీసర్లకు చోటు కల్పించలేదు. ఇటీవల మున్సిపల్‌ కార్యాలయం పక్కనున్న కాంప్లెక్స్‌లో వీరికి ఆఫీసు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రూ.5 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు. అందులో ఫర్నీచర్‌తోపాటు రెనోవేషన్‌ చేయాల్సి ఉంటుంది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటివరకు పనులు మొదలుపెట్టలేదు. ఫలితంగా వార్డు ఆఫీసర్లకు చోటు కరువైంది. కార్యాలయానికి ఎవరు ఎప్పుడు వచ్చి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

వారిదే కీలకపాత్ర

ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పారిశుధ్య ప్రణాళిక అమలు, ఇంటింటా చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయడం, మురికికాలువలు, ప్రజామరుగుదొడ్లను శుభ్రం చేయించేలా చూడాలి. ప్లాస్టిక్‌ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇవి జిల్లాలో మచ్చుకై నా కనిపించడం లేదు. నీటి సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు, పట్టణ పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను చూడాల్సి ఉంటుంది. ఇంటి పన్ను, ఫీజులు, చార్జీలు అంచనా వేస్తూ జాబితాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ వీరికంటూ ఓ కార్యాలయం లేకపోవడంతో సమస్యగా మారింది. రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షించే వీరికి ఓ ఆఫీస్‌ కేటాయిస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ నంబరు ఇస్తే ప్రజలు ఏమైనా సమస్యలుంటే చెప్పుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రజలు

జగిత్యాల బల్దియాలో 48 వార్డులు ఉన్నాయి. వివిధ సమస్యలపై ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. ఏ వార్డు అని అధికారులు తెలుసుకుని సదరు వార్డు ఆఫీసర్‌ను కలవాలని సూచిస్తున్నారు. కానీ.. వారు ఎక్కడుంటారో మాత్రం చెప్పడం లేదు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కార్యాలయంలో వారికంటూ ఓ గది కేటాయించి బోర్డు ఏర్పాటుతోపాటు సెల్‌నంబర్‌ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది సిబ్బంది రాకపోకలు సాగిస్తూ సకాలంలో కార్యాలయానికి రావడం లేదనే ఆరోపణలున్నాయి.

ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి

ఇప్పటికే మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోపాటు, ఎక్కడా డ్రైనేజీలుగానీ, నాలాలుగానీ శుభ్రంగా లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డు ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తే పారిశుధ్యం కొంత మెరుగు పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పారిశుధ్యం మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కౌన్సిలర్లు ఉండటంతో ప్రజలు ఏ సమస్యనైనా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడం, స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన ఉండటంతో ఈ వార్డు ఆపీసర్లే వారికి కీలకంగా మారారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వారికంటూ ఓ చోటు ఏర్పాటు చేసి ప్రజల్లో ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసర్‌ ఉంటారన్న అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వార్డు ఆఫీసర్లకు మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు వేయడం జరిగింది. రూ.5 లక్షలతో ఫర్నీచర్‌తో పాటు రెనోవేషన్‌ చేయాల్సి ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌తో పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

– చరణ్‌, ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement