
వికలాంగుల పింఛన్ పెంచండి
● కేంద్రమంత్రిని కలిసిన మంత్రి అడ్లూరి
గొల్లపల్లి: వికలాంగుల పింఛన్ పెంచాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి కేంద్రమంత్రి వీరేందర్ కుమార్‌కు విన్నవించారు. గురువారం ఆయనను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. పెన్షన్ మొత్తాన్ని రూ.3000 పెంచాలని, అర్హతను 80శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని కోరారు. 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యానికే పరికరాలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్, పెరిక కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అధ్యక్షుడు కోట మల్లికార్జున్‌రావు ఉన్నారు.
ఎస్సారెస్పీ నీటి విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, వరద కాల్వకు గురువారం సాగునీటిని విడుదల చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు ఉన్నతాధికారులు గణేశ్, వంశీ, విన్యాస్‌రెడ్డి పాల్గొన్నారు. కాకతీయ కాలువకు మూడు వేల క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్‌కు 150, సరస్వతి కెనాల్‌కు 300, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, వరదకాలువకు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 2,153 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 7,353 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.
ప్రధాని మోదీకి ఆపరేషన్ సిందూర్ రాఖీ
విద్యార్థులు తయారు చేసిన ఆపరేషన్ సిందూర్ రాఖీ
కోరుట్ల: పట్టణంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీకి ఆపరేషన్ సిందూర్ రాఖీని స్వయంగా తయారు చేసి పోస్టు ద్వారా పంపించారు. ఆపరేషన్ సిందూర్‌లో మోదీ, భారత సైన్యం పాకిస్తాన్‌పై చూపిన ధైర్యసాహసాలు, ఆకాష్, బ్రహ్మోస్, రాఫెల్, ఎస్–400 యుద్ద విమానాల చిత్రాలను రాఖీలో పొందుపరిచారు. భానుగ్న, సంజన, సాయిశ్రీ,శరణ్య, మనుశ్రీ, పూజ, లిఖిత, చైత్రవి రాఖీ తయారీలో భాగస్వామ్యం అయ్యారు. ఉపాద్యాయులు చావ్ల లక్ష్మీనారాయణ, చందా నాగరాజు, బాస సుమలత, పిస్క వేణు గైడ్ చేశారు. హెచ్‌ఎం కృష్ణమోహన్ రావు అభినందించారు.
అయోధ్య ఆస్పత్రికి ఎన్‌క్వాస్ సర్టిఫికెట్
రాయికల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. గురువారం ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈనెల 11 జరిగే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 19 ఏళ్లలోపు పిల్లలందరికీ మాత్రలు వేయాలన్నారు. అయోధ్య ఆస్పత్రికి ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి, మండల వైద్యాధికారి సతీశ్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి రవీందర్, ఐఎంఏ సత్యనారాయణ, పర్యవేక్షకులు సాగర్, మురళీధర్, భూమేశ్వర్ పాల్గొన్నారు.

వికలాంగుల పింఛన్ పెంచండి

వికలాంగుల పింఛన్ పెంచండి