బల్దియాల్లో పన్ను బాదుడు
● ఆస్తి పన్ను భారీ మొత్తంలో పెంచిన ప్రభుత్వం ● గత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు ● ఆందోళనలో దిగువ, మధ్యతరగతి ప్రజలు
మెట్‌పల్లి: మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పెంపును అమలు చేస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. పట్టణీకరణలో భాగంగా మున్సిపాలిటీలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఆదాయవనరులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వసతులు కల్పన, సిబ్బందికి వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం స్తి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కసారిగా రెండు, మూడింతలు పెంచడం విమర్శలకు తావిస్తోంది.
జియో ట్యాగింగ్ కొలతల ఆధారంగా..
● పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును సరిగ్గా లెక్కించి వసూలు చేయడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రతి మున్సిపాలిటీలో జియో ట్యాగింగ్ సర్వే నిర్వహించింది.
● ఆ సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని అక్షాంశం, రేఖాంశం ఆధారంగా గుర్తించడంతోపాటు ఇంటి కొలతలు, ఇతర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
● ప్రస్తుతం ఆ కొలతలను పరిగణనలోకి తీసుకునే ప్రతి ఇంటికి ఆస్తి పన్నును పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
● ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రాక ముందు సిబ్బంది కొలతలు వేయకుండా నామమాత్రంగా పన్ను వేసి వసూలు చేసేవారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడేది.
● జియో ట్యాగింగ్‌తో పక్కా కొలతలతో లెక్కింపు జరిగి దానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోంది.
బెంబేలెత్తిపోతున్న ప్రజలు..
● చాలాకాలం పాటు ఆస్తి పన్నును పెంచకుండా ఉన్న ప్రభుత్వం.. ఒక్కసారిగా జియో ట్యాగింగ్‌ను పరిగణనలోకి తీసుకుని పెద్ద మొత్తంలో భారం మోపడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
● కొందరికి పన్ను రెట్టింపు అయితే.. మరికొందరికి రెండింతలు, మూడింతలే కాకుండా అంతకంటే ఎక్కువ పెరిగింది.
● మెట్‌పల్లి మున్సిపాలిటీలోని కళానగర్‌లో ఓ ఇంటికి గతంలో రూ.2వేలు పన్ను ఉంటే.. ఇప్పుడు ఆది రూ.7900కు పెరిగింది. ఇదే కాలనీలో మరో ఇంటికి గతంలో రూ.1050 ఉంటే, ప్రస్తుతం రూ.4500కి పెరిగింది.
● ఇలా ప్రతి కుటుంబంపై అధిక భారం పడడంతో దిగువ, మధ్యతరగతి ప్రజలు అందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఇంటి అనుమతులు, ప్రకటనలు, నల్లా బిల్లు, ఆస్తి పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రధానంగా ఆస్తి పన్నుతోనే ఎక్కువ ఆదాయం వస్తోంది.
ఐదు మున్సిపాలిటీల్లో 62,585 ఇళ్లు ఉన్నాయి. ఏటా ఆస్తి పన్ను ద్వారా సుమారు రూ.17కోట్ల ఆదాయం సమకూరుతోంది.
వీటిలో చాలాకాలంగా ఆస్తి పన్నును సవరించలేదు.
పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం లేకపోవడంతో మున్సిపాలిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో పన్నును పెంచింది.
కొలతల ప్రకారమే పన్ను విధింపు
ప్రతి ఇంటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి గతంలోనే కొలతలు వేశారు. ప్రస్తుతం వాటిని పరిగణనలోకి తీసుకుని ఆస్తి పన్నును సవరించాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రభుత్వం సవరించింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ప్రజలు మా దృష్టికి తీసుకరావాలి. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపడుతాం.
– అక్షయ్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, మెట్‌పల్లి
బల్దియాల్లో పన్ను బాదుడు


