సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..! | Sakshi
Sakshi News home page

సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..!

Published Fri, Apr 21 2023 12:50 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/మానకొండూరు: కాల్పుల మోతతో మానకొండూరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెలో తుపాకులు గర్జన విని జనం భీతిల్లారు. రౌడీషీటర్‌ అరుణ్‌పై కత్తులు, తుపాకులతో జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

నేరచరిత్ర కలిగిన అరుణ్‌ ఆది నుంచి వివాదాస్పదుడే. వరుసగా ఇతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత సీపీ సత్యనారాయణ ఇతనికి కమిషరేట్‌ నుంచి బహిష్కరణ విధించారు. ఇటీవల కమిషనరేట్‌ బహిష్కరణ పూర్తిచేసుకుని వచ్చిన అరుణ్‌పై తుపాకులతో హత్యాయత్నం జరగడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటనకు బీజం ఇప్పుడు పడింది కాదు, పాత కక్షల నేపథ్యంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ముందురోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ప్రధాన నిందితుడు సాయితేజ్‌ హనుమాన్‌ ఆలయంలోనే అరుణ్‌ని చంపుతానని ప్రతినబూనాడు.

వస్తూనే దాడి.. కాల్పులు

● పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ఉండే వీణవంక సాయితేజ్‌ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందురోజు రాత్రి (నూతన సంవత్సరం రోజు) జీఎం కాలనీలోని హనుమాన్‌ గుడిలో తన సోదరి మరణానికి కారణమైన ‘మానకొండూరు అరుణ్‌ గాని తలకాయ కోసి.. జీఎం కాలనీ చౌరస్తాలో పెట్టకపోతే నేను సూరి కొడుకునే కాదు’ అని శపథం చేశాడు.

● ఈ విషయాన్ని పలువురు స్థానికులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ‘సాక్షి’ చేతికి చిక్కింది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న సాయి.. బుధవారం అర్ధరాత్రి తన మిత్రులు భువనగిరి జిల్లా దత్తారుపల్లికి చెందిన పాల మల్లేశ్‌, మానకొండూరు మండలం కెల్లెడ గ్రామానికి చెందిన బైరగోని మధు, గోదావరిఖనికి చెందిన చంటితో కలిసి రాత్రి 9 గంటల సమయంలో వాహనంలో మానకొండూరుకు వచ్చాడు.

● వెల్ది గ్రామానికి వెళ్లే మార్గం నుంచి వీరు గ్రామంలోకి తుపాకీ, కత్తులతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 9.30 గంటల సమయంలో అరుణ్‌ తన ఇంటి ముందు సోదరులతో కలిసి మద్యం తాగుతుండగా.. వీరికి తారసపడ్డాడు. వారిని చూడగానే భయంతో అరుణ్‌ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.

● అతడిని వెంబడించిన నలుగురు బీరు బాటిళ్లతో దాడిచేశారు. అడ్డువచ్చిన అరుణ్‌ భార్య సుమ, పెద్ద కూతురు వైష్ణవిని తుపాకీ చూపించి తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న అరుణ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరపగా గురితప్పాయి. ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అరుణ్‌పై కోపంతో సదరు ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా, రక్తాలు కారేలా కొట్టారు.

● వీరి అరుపులు విన్న స్థానికులు వచ్చారు. వచ్చిన వారిని తుపాకీ చేతబూనిన వ్యక్తి బెదిరించి పంపాడు. తరువాత చాలామంది రావడంతో సాయితేజ్‌ పరారు కాగా.. పాలమల్లేశ్‌, మధును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.

● పేలని బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడింది కంట్రీమేడ్‌ తుపాకీ (తపంచా) అని తూటా ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. మరో నిందితుడు చంటి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం.

తనకు సంబంధం లేదంటున్న అరుణ్‌

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిందితులు గోదావరిఖనికి చెందిన సాయితేజ్‌, చంటి, మరో ఇద్దరు మిత్రులు అని వెల్లడించాడు. ఎందుకు దాడి చేశారు..? అని అడిగిన ప్రశ్నకు.. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని, తనకువారితో ఎలాంటి సంబంధమూ లేదని, వారు గంజాయి విక్రయిస్తారని తెలిపాడు. సంబంధం లేని వ్యక్తి చేసే పని, చిరునామా, పేరుతో సహా ఎలా తెలపగలిగాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

అతనికి సాయితేజకు ఉన్న వైరం ఏంటీ..? అతని సోదరి మరణంలో అరుణ్‌ ప్రమేయం ఎంతవరకు ఉంది..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులకు, బాధితుడికి నేరచరిత ఉన్న విషయం వాస్తవమేనని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌ సీపీ ఎల్‌.సుబ్బారాయుడు ‘సాక్షి’కి తెలిపారు. నిందితుల కోసం మొత్తం మూడు బృందాలు సాయి కోసం గాలిస్తున్నాయి. ఇందులో రెండు హైదరాబాద్‌కు వెళ్లగా.. ఒక టీం గోదావరిఖనికి వెళ్లినట్లు సమాచారం.

బిహార్‌ నుంచి ఆయుధం..?

ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికి ఆయుధం ఎక్కడిది..? అన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాకీ కాల్చడంలో నిందితులకు అనుభవం లేదని తాజా ఘటనతో తేలిపోయింది. బుల్లెట్లు వేగంగా లోడు చేయలేకపోవడం.. గురిచూసి కాల్చలేకపోయిన విధానాన్ని బట్టి నిందితులు ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు.

రెండు నెలల క్రితం ఓ కేసు విషయంలో సాయి సెల్‌లోకేషన్‌ బిహార్‌లో చూపించిందని గోదావరిఖని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అతను కాశీయాత్రకు వెళ్లి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సాయికి బిహార్‌లో మిత్రులు ఉండి ఉంటారని, వారి ద్వారానే ఆయుధం కొని ఉంటాడని అనుమానిస్తున్నారు.

మాట్లాడకుండానే.. దాడి చేశారు..

మానకొండూర్‌లో ఉన్న మా అత్త గారింటికి నా పిల్లలను చూసేందుకు వచ్చాను. బుధవారం రాత్రి అన్నం తిని బయట ఉండగా గొడవ అవుతోంది. ఈ లోగానే అరుణ్‌ మా ఇంటి వైపు వచ్చాడని కొందరు మా ఇంటివైపు పరుగు తీసుకుంటూ వచ్చారు. వాడేడి అంటూ ఆగ్రహంతో నాపై స్టీలు ప్యాల క్యాన్‌తో దాడి చేశారు. తల పగిలి రక్తస్రావం జరిగింది. ఇంట్లో వాళ్లపై దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తర్వాత భయాందోళనతో చాలా సేపు తలుపు వేసుకుని ఇంట్లోనే ఉన్నాం, పోలీసులు వచ్చాక బయటకు వచ్చా. – బీరం శ్రీనివాస్‌, గాయపడ్డ వ్యక్తి

1/2

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement