కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం నిల్వలు
● పట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు
జగిత్యాలక్రైం/ జగిత్యాలలోని ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు డంప్ చేస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని పరిశీలించి వెళ్లిపోయారు. సదరు అభ్యర్థి ఇంట్లోకి వెళ్లకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోచీబజార్‌లో మద్యం పట్టివేత
పట్టణంలోని మోచీబజార్‌లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. రూ.3,250 విలువైన 13 లీటర్ల మద్యాన్ని ఇంట్లో ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. అరవింద్‌నగర్‌కు చెందిన ఒకరి ఇంట్లోనుంచి రూ.3వేల విలువైన 2.5లీటర్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు.


