సీఎం కేసీఆర్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ - Sakshi

బీజేపీ కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌

మల్యాల(చొప్పదండి): సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాలు విసిగి, వేసారిపోయారు, ఆయన చెప్పేదొకటి, చేసేది మరోటని, ఈ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్‌ ఆధ్వర్యంలో ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ముఖ్య అథితిగా ఈటెల రాజేందర్‌ హాజరై మాట్లాడారు.

యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్నారు.. ఇప్పటిదాకా ఏదీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో సామాన్యులకు న్యాయం అందడం లేదని అన్నారు. కేసీఆర్‌కు ఓటు వేయకపోతే రైతుబంధు రాదని, పింఛన్‌ బంద్‌ చేస్తరని, కల్యాణలక్ష్మీ ఇవ్వరంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

అధికారంలో ఎవరు ఉన్నా ఇవన్నీ వస్తాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు రూ.6వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు ధర్మంవైపే నిలిచారని గుర్తుచేశారు. కోటీశ్వరులకు సైతం రైతుబంధు ఇస్తూ నిరుపేదల కడుపుకొడుతున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద దళితబంధు ఇస్తామని, కోటీశ్వర్లకు ఇవ్వమన్నారు. రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

తనతో జతకట్టిన కాంగ్రెస్‌, బీఎస్పీ, టీడీపీలను కేసీఆర్‌ ఖతం చేశారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదని, సర్పంచులకు అధికారం లేదని, అధికారం అంతా ఎమ్మెల్యేల చేతుల్లోనే కేంద్రీకృతం చేశారని విమర్శించారు. గతంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేవారని, ఇప్పుడు ఎమ్మెల్యేల ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ నాయకులను అరెస్టు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే 15 ఆర్థిక సంఘం నిధులతోనే గ్రామ పంచాయతీల్లో వేతనాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

కేసీఆర్‌ పాలన కొనఊపిరితో ఉందని, కరీంనగర్‌ జిల్లా ప్రజలు చైతన్యవంతులని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు బొడిగె శోభ, సుద్దాల దేవయ్య, ముదుగంటి రాజు, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లేటి రమేశ్‌, పొన్నం మల్లేశం, జనగం రాములు, సురేశ్‌, మల్లేశం, ఎంపీటీసీలు రాచర్ల రమేశ్‌, సంగని రవి పాల్గొన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top