కంకర టిప్పర్‌ బోల్తా

సిబ్బందికి సూచనలిస్తున్న డాక్టర్‌ జైపాల్‌రెడ్డి - Sakshi

 డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడమే కారణం

జగిత్యాల క్రైం: జగిత్యాల రూరల్‌ మండలంలోని హన్మాజీపేట శివారులో శుక్రవారం సాయంత్రం ఓ కంకర టిప్పర్‌ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల అర్బన్‌ మండలంలోని పెర్కపల్లి నుంచి సారంగాపూర్‌ మండలంలోని రంగపేట వరకు డబుల్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కంకర తీసుకువస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడింది. ఆ సమయంలో రహదారి వెంట ఎవరూ వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం టిప్పర్‌ను జేసీబీ సహాయంతో తొలగించారు.

ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ సమీపంలో ఓ పూరి గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన దేవ్‌సింగ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో చెరుకు కోసేందుకు వచ్చాడు. ఇక్కడే గుడిసెలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అందరూ చెరుకు కోసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుంది. చుట్టుపక్కలవారు ఆర్పేందుకు ప్రయత్నించగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో గుడిసె లోపల ఉన్న దుస్తులు, బియ్యం, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.20 వేల వరకు నష్టం జరిగిందని బాధితుడు దేవ్‌సింగ్‌ తెలిపారు.

ఇటుకలబట్టీ పాఠశాల పరిశీలన
కోరుట్ల: పట్టణ శివారులోని కల్లూర్‌ రోడ్‌లో ఇటుకలబట్టీ వద్ద ఏర్పాటు చేసిన పాఠశాల(పని వద్ద పాఠశాల)ను జిల్లా సెక్టోరియల్‌ అధికారి కె.రాజేశ్‌ శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ 12 మంది ఒడిశా విద్యార్థులకు ఒడియా భాషలో ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడి, విద్యాబోధన తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇటుకలబట్టీ నిర్వాహకులు రామసుబ్బయ్య, కిష్టయ్య, సీఆర్‌పీ గంగాధర్‌ పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి
మెట్‌పల్లి(కోరుట్ల): సాధారణ ప్రసవాల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో శుక్రవారం వైద్య సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సీజేరియన్లతో కలిగే అనర్థాలను గర్భిణులకు వివరించాలని పేర్కొన్నారు. తప్పనిసరి అయితే తప్ప సిజేరియన్లు చేయవద్దని సూచించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వైద్యులు అంజిరెడ్డి ఉన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top