దొంగలు ఉత్తరభారతీయులా? | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 1:40 PM

- - Sakshi

జగిత్యాలక్రైం/కొండగట్టు(చొప్పదండి): విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దోపిడీలో పాల్గొన్న దొంగలు ఉత్తరభారతీయులు లేదా పొరుగు రాష్ట్రంవారు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వీడియోల ఆధారంగా.. పోలీసులు ఈ మేరకు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. ఆలయం వెనక భాగాన ఉన్న భేతాళుడి గుడి నుంచి దొంగలు తలుపులు బద్దలు కొట్టినట్లు గుర్తించారు. చూసేవారికి అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డులను తలపించేలా డ్రెస్సింగు వేసుకుని, చేతిలో లాఠీలు పట్టుకున్నారు.

సీసీ కెమెరాల్లో ముఖాలు కనబడకుండా తలలకు మంకీ క్యాపులు ధరించి, ఒంటిని పసుపురంగు శాలువాలతో కప్పుకున్నారు. తలుపులు బద్దలు కొట్టేందుకు వీలుగా ఉండే రెంచ్‌లు, ఇతర పనిముట్లను శాలువాల చాటును లోనికి తీసుకువచ్చారు. వీరి కదలికలు ఆహార్యం, ఆకారాలను బట్టి వీరు ఉత్తరభారతీయులుగా అనుమానిస్తున్నారు.

వారంరోజులుగా జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆలయాల చోరీలకు, వీటికి ఏదైనా లింకుందా లేదా? అన్న విషయాలను సైతం పోల్చిచూస్తున్నారు. రాత్రిపూట వెండి తాపడాలను పనిముట్లతో తొలచుకుపోయినా ఎలాంటి చడీచప్పుడు రాకుండా జాగ్రత్తపడ్డారంటే వీరంతా పక్కా ప్రొఫెషనల్‌ గ్యాంగ్‌ అన్న నిర్ధరణకు వచ్చారు. వీరికి సంబంధించిన కీలక సమాచారం కూడా పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. వీరు మహా రాష్ట్రవైపు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

పోలీసులపై చర్యలు..!
ఈ క్రమంలో ఆలయానికి రాత్రిపూట భద్రత కల్పించిన పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు విధుల్లో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

దొంగలను గుర్తించిన పోలీసులు?
అంజన్న ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సీసీపుటేజీల్లో రికార్డుల ప్రకారం దొంగలను పోలీసులు గుర్తించి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారి ఉన్న ఆచూకి కూడా కనుగొన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీరి అరెస్టును పోలీసులు ధ్రువీకరిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.
 

1/2

2/2

Advertisement
Advertisement