గాజా పునరభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా ప్రకటన
న్యూయార్క్/వాషింగ్టన్: గాజా సంక్షోభ నివారణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో రెండో దశ మొదలైంది. గాజా పునరభివృద్ధి కోసం ట్రంప్ సారథ్యంలో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటైంది. ఇందులో భారత సంతతికి చెందిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితర ప్రముఖులుగా సభ్యులుగా ఉన్నారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శుక్రవారం ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల పేర్లను విడుదల చేసింది.
‘దౌత్యం, అభివృద్ధి, మౌలిక రంగం, ఆర్థిక వ్యూహం..’ఇలా అన్ని రంగాల్లో అనుభవం గడించిన వారికి ఇందులో చోటు కల్పించినట్లు ప్రకటించింది. వీరిలో మహిళలు, పాలస్తీనియన్లకు చోటుదక్కకపోవడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ పీస్‌లో బంగా, రూబియోలతోపాటు అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపొలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సీఈవో మార్క్ రొవాన్, యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియెల్ ఉన్నారు.
సుస్థిర గాజా, దీర్ఘకాల పురోగతికి సంబంధించి వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బాధ్యతలున్నాయని వైట్ హౌస్ తెలిపింది. అంతేకాదు, అదనపు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, ఖతార్ దౌత్యవేత్త అలీ అల్–థవాడి, ఈజిప్టుకు చెందిన హస్సన్ రషద్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ, ఇజ్రాయెల్ వ్యాపారవేత్త యకిర్ గబాయ్, నెదర్లాండ్స్ మాజీ ఉప ప్రధాని సిగ్రిడ్ కాగ్ ఉంటారని వైట్ హౌస్ వివరించింది. గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా బల్గేరియాకు చెందిన ఐరాస పశ్చిమాసియా దూత నికొలాయ్ మ్లాదెనొవ్‌ను నియమించినట్లు వెల్లడించింది. పునరభివృద్ధి ప్రణాళికను వేగంగా అమలు చేసేందుకు 15 మందితో ఏర్పాటైన నేషనల్ కమిటీ ఫర్ ది అడ్మిని్రస్టేషన్ ఆఫ్ గాజా(ఎన్‌కాగ్)ను పర్యవేక్షిస్తారు.
ఐఎస్‌ఎఫ్ కూడా..
ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్‌ఎఫ్) కమాండర్‌గా మేజర్ జనరల్ జాస్పెర్ జెఫ్పర్స్‌ను నియమించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈయన గాజాలో భద్రత, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పడంలో కృషి చేస్తారని తెలిపింది. భద్రతా చర్యలకు సారథ్యం వహిస్తూ సమగ్ర డీమిలిటరైజేషన్‌కు, మానవతా సాయం పంపిణీ, పునర్నిర్మాణ సామగ్రి అందజేత చర్యలను పర్యవేక్షిస్తారంది. గాజా సమగ్ర ప్రణాళిక లక్ష్యాల సాధన కోసం అంతర్జాతీయ సమాజంతోపాటు కీలకమైన అరబ్ దేశాలతో సన్నిహిత భాగస్వామ్యం కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. ఎన్‌కాగ్, బోర్డ్ ఆఫ్ పీస్, ఐఎస్‌ఎఫ్‌లకు పూర్తి స్థాయిలో సహకరించాలని సంబంధిత వర్గాలకు అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.
కైరోలో ఎన్‌కాగ్ మొదటి భేటీ
గాజా రోజువారీ పాలనా బాధ్యతలను చేపట్టే పాలస్తీనా కమిటీ ఎన్‌కాగ్, ఈజిప్టు రాజధాని కైరోలో శుక్రవారం మొదటిసారిగా సమావేశమైంది. అనంతరం, గాజాలో పాలస్తీనా అథారిటీ మాజీ అధికారి, ఇంజనీరింగ్ నిపుణుడు అయిన కమిటీ సారథి అలీ షాథ్ మీడియాతో మాట్లాడారు. గాజాలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు తక్షణమే రంగంలోకి దిగుతామన్నారు. గాజా తిరిగి కోలుకునేందుకు, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు కనీసం మూడేళ్లయినా పడుతుందని చెప్పారు. అత్యవసరాలను సమకూర్చడంతో గూడు కోల్పోయిన పాలస్తీనా వాసులకు ఆశ్రయం కల్పించడానికి మొదటగా తాము ప్రాధాన్యమిస్తామన్నారు.
గతేడాది అక్టోబర్ 10వ తేదీన ట్రంప్ ప్రణాళిక అమల్లోకి వచి్చన తర్వాత గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఇజ్రాయెల్ ఉపసంహరించుకోగా, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వేలాది మంది తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం సరిగ్గా అమలయ్యేలా చూడటం, హమాస్ వంటి సాయుధ గ్రూపులను నిరాయుధుల్ని చేయడం అతిపెద్ద సవాలుగా మారాయి. గాజాలో రోజువారీ కార్యకలాపాలను బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షణలో అలీ షాథ్ సారథ్యంలోని కమిటీ చూసుకుంటుంది.


