దేవుడు చెప్పాడని హల్‌చల్‌.. 37వేల అడుగుల ఎత్తులో విమానం డోర్‌ తీయబోయి..

Woman Tried To Open Side Door Of Aircraft At 37000 Feet - Sakshi

వాషింగ్టన్‌: విమానం గాల్లోకి ఎగిరాక చిన్న పొరపాటు జరిగినా.. పెను ప్రమాదం జరుగుతుంది. అలాంటి 37వేల అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత ఓ మహిళ చేసిన పనికి ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తనకు దేవుడు చేప్పాడంటూ విమానం డోర్‌ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. మహిళ ప్రవర్తనతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

అర్కన్సాస్‌ తూర్పు జిల్లా కోర్టు విడుదల చేసిన పత్రాల ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్‌ అగ్బెనినో ఇటీవల ఒహియోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానం 192 ఎక్కింది. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది.

‘దేవుడు నన్ను ఒహియో రమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు’ అంటూ గట్టిగా అరస్తూ హల్‌చల్‌ చేసింది. దాంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె కొరికి గాయపర్చింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్‌ అండ్‌ హిల్లరీ క్లింటన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహియోకు బయల్దేరినట్లు ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పింది. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఐదుగురితో ప్రేమ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బాయ్‌ఫ్రెండ్‌.. కానీ!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top