అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్‌కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది.
నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్‌ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌లు ఆషామాషీగా లేవు..
రాండీ బ్రెస్నిక్: మిషన్‌కు సారథి
ఆర్టెమిస్-3 కమాండర్‌గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్‌గా కూడా సేవలందించారు. పలు స్పేస్‌వాక్‌లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.
లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడు
ఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇటాలియన్‌గా రికార్డు సృష్టించారు. స్పేస్‌వాక్‌లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామి
నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంతో ఉపయోగపడనుంది.
ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్
ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.
అమెరికా-యూరప్ కలయిక
ఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఇది ట్రయల్ మాత్రమే!
ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.
ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం.
సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్‌లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర.
జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్‌షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్‌కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.

అందుకే కీలకం
అంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్‌లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం.
1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.
ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్‌లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.
:::సాక్షి వెబ్ ప్రత్యేకం


