రష్యా వ్యాక్సిన్‌ను నమ్మలేమంటున్న సైంటిస్ట్‌లు!

We Can't Trust Russia Vaccine With Out Trail Data Says Scientists - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. అగ్రరాజ్యం మొదలుకుని ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి కోరలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. అనేక దేశాలు ఈ వ్యాక్సిన్‌ను కనిపెట్టడం కోసం పోటీపడుతున్నాయి. అయితే రష్యా కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిందని, ఇందుకు సంబంధించిన క్లినికల్‌ ట్రయిల్స్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ‘స్పుత్విక్ వి’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను విమర్శిస్తున్నారు. థర్డ్ ఫేజ్‌ ట్రయల్స్ అవ్వకుండానే మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్‌ను ఎలా తీసుకువస్తారని  చాలా మంది శాస్త్రవేత్తలు  ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్స్‌ డేటా కూడా ఇంకా విడుదల చేయలేదని, ట్రయల్స్‌ డేటా లేకుండా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని ఎలా నమ్ముతామని వారు అంటున్నారు. 

ఈ వ్యాక్సిన్‌ మొదటి, రెండవ ట్రయల్స్‌ మంచి ఫలితాలను ఇచ్చాయని, థర్డ్‌ ట్రయల్‌ తన కుమార్తె పైనే ప్రయోగించినట్లు పుతిన్‌ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ కచ్చితంగా కరోనా మహమ్మారిని తరిమి కొడుతుందని, ఈ వ్యాక్సిన్‌ వేసుకుంటే 2 సంవత్సరాల వరకు కరోనా వైరస్‌ దరిచేరదని ఆయన దీమా వ్యకం చేశారు. అయితే ఇది ఒక బాధ్యతారాహిత్యమైన నిర్ణయమని అనేక మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ను వేసుకుంటే ఎలాంటి సైడ్‌ ఎఫ్టెక్స్‌ వస్తాయో ఇంకా సరిగా అధ్యయనం జరగలేదన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానం వ్యకం చేస్తున్నారు. సరిగా పరీక్షించని వ్యాక్సిన్‌ను అనేక మంది ప్రజలపై ప్రయోగించడం అనైతికమని వారు అంటున్నారు. వ్యా‍క్సిన్‌ ట్రయల్స్‌ డేటాను, సేఫ్టీ డేటాను అమెరికా, యూరప్‌తో పాటు పలు దేశాలకు సమర్పించాలని అప్పుడే ఈ వ్యాక్సిన్‌కు లైసెన్స్‌ లభిస్తుందని పలువురు ఉన్నతవర్గాలకు చెందిన అధికారులు తెలిపారు. ఇదిలా వుండగా ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూలు కడుతూ, బిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ ఇస్తున్నాయి.   

చదవండి: రష్యా వ్యాక్సిన్‌ క్రేజ్‌.. 20 దేశాలు ప్రి బుకింగ్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top