న్యూఢ్లిలీ: సుదూర తీరంలో జరుగుతున్న యుద్ధం.. ఇప్పుడు మన వంటగదిపై, మన ఉద్యోగాలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’లో గత 37 రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో ఇండియా నుంచి జపాన్ వరకు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జల మార్గం గుండానే జరుగుతుండగా, అందులో ఏకంగా 90 శాతం ఆసియా దేశాలకే చేరుతుంది. ఇప్పుడు ఆ సప్లై చైన్ దెబ్బతినడంతో చమురు కొరత, ధరల పెరుగుదలతో సామాన్యుల దైనందిన జీవితం తలకిందులవుతోంది.
భారత్‌పై తీవ్ర ప్రభావం
మన దేశంలోని 60 శాతం ఎల్‌పీజీ అవసరాలు దిగుమతులపైనే ఆధారపడి ఉండగా, అందులో 90 శాతం హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. సరుకు రవాణా నిలిచిపోవడంతో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిలిండర్ల కోసం జనాలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ కొరతతో బెంగళూరులో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు పాక్షికంగా మూతపడ్డాయి. గుజరాత్‌లో ఇండస్ట్రియల్ గ్యాస్ దొరకక సిరామిక్ తయారీ యూనిట్లను నిలిపివేశారు. దీంతో ప్యాకేజింగ్, ప్రింటింగ్ రంగాలు దెబ్బతినడమే కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
ఇరుగు పొరుగు దేశాల విలవిల
శ్రీలంకలో మళ్లీ 2022 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు పని దినాలను కుదించి ఏకంగా బుధవారాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. పాకిస్తాన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా (సింధ్ ప్రావిన్స్ మినహా) ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధించారు. రాత్రి 8 గంటలకే షాపింగ్ మాల్స్, 10 గంటలకల్లా రెస్టారెంట్లు, బేకరీలు, ఫంక్షన్ హాళ్లు తప్పనిసరిగా మూసి వేయాలని ఆదేశించారు.
ఆసియాలో వింత పరిస్థితులు
థాయ్‌లాండ్‌లో ఏసీ టెంపరేచర్ 26-27 డిగ్రీల మధ్యే ఉంచాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటించాలని సూచించారు. మయన్మార్‌లో ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధన విధానాలు ప్రవేశపెట్టారు. ఇక జపాన్, దక్షిణ కొరియాలో ముడి చమురు ఉత్పత్తి ‘నాఫ్తా’ రాక నిలిచిపోయి ప్లాస్టిక్ కవర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. నీటిని వేడి చేయడానికి వాడే ఇంధనం రాకపోవడంతో, ఏకంగా పౌరులు తమ స్నానాలు చేసే ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలని దక్షిణ కొరియా ప్రభుత్వం సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి: పట్టు కోసం ‘దీదీ’.. పక్కా వ్యూహంలో బీజేపీ


