కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక సిగలో ప్రధాన కేంద్రంగా నిలిచిన కోల్‌కతా.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి అత్యంత కీలక యుద్ధభూమిగా మారింది. కోల్‌కతాలో తన పట్టు నిలుపుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టుదలతో ఉండగా, పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే పక్కా వ్యూహంతో బీజేపీ బరిలోకి దిగింది. తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఈసారి ఎన్నికల పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉండనుందో స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాలతో పోరు మరింత ఉత్కంఠ భరితంగా మారనున్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు సిసలు పోరు
కోల్‌కతా నగర పరిధిలో సుమారు 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హై-ప్రొఫైల్ స్థానం ‘భవానీపూర్’. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బీజేపీ కీలక నేత సువేందు అధికారికి మధ్య నేరుగా కురుక్షేత్రం నెలకొంది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 140 నుంచి 170 స్థానాలను గెలుచుకోవచ్చని, అదే సమయంలో బీజేపీ సైతం బలమైన పోటీనిస్తూ 100 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది రసవత్తరమైన పోటీని సూచిస్తున్నది.
కోల్‌కతాలో గట్టి పోటీ..
గ్రామీణ బెంగాల్‌తో పోలిస్తే కోల్‌కతా నగరంలో అధికార పార్టీకి సవాలు గట్టిగానే ఉండబోతోందని రాష్ట్ర స్థాయి వర్గాలు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను, పాలనాపరమైన లోపాలను, పట్టణ ఓటర్లలో రగులుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ‘ ఈసారి కోల్‌కతాలో ఏ పార్టీకీ ఏకపక్ష విజయం దక్కదు. టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత పునాది ఉన్నప్పటికీ, నగరంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది’ అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.
బలమైన సానుకూల అంశాలు
నగరంలో పోటీ తీవ్రంగా మారుతున్నప్పటికీ, అధికార పార్టీకి ఇప్పటికీ పలు బలమైన సానుకూల అంశాలు ఉన్నాయి..
గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ఏర్పడిన పటిష్టమైన సంస్థాగత నెట్‌వర్క్.
పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు.
ముఖ్యంగా దక్షిణ కోల్‌కతాలో మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత ఆదరణ, ఛరిష్మా.
భవానీపూర్, బల్లిగంజ్, ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో టీఎంసీ సంస్థాగతంగా అత్యంత బలంగా ఉందని రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి సమీకరణాలు ఇప్పటికీ ఆ పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి.
వ్యూహం మార్చిన ‘కమలం’
మరోవైపు, బీజేపీ కూడా కోల్‌కతాపై మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడిన ఆ పార్టీ.. ఇప్పుడు తన పంథా మార్చుకుంది. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత, ఉద్యోగాల సృష్టి, పౌర సమస్యలను ఎత్తిచూపుతూ నిర్దిష్ట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘మైక్రో-లెవల్’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కోల్‌కతాలోని కీలక స్థానాలను గెలుచుకోవడం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకమని బీజేపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణం
హోరాహోరీ ప్రచారాలు, వీధి స్థాయి ఘర్షణలు, భవానీపూర్ లాంటి ప్రతిష్టాత్మక పోరుతో కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రాఫిక్ రద్దీ నుంచి వాయు కాలుష్యం వరకు నగరంలోని పౌర సమస్యలు కూడా ఈసారి ఓటర్ల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పౌర సమాజ సంఘాలు సైతం ఈ పట్టణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
తీర్పు ఎటువైపు?
ఒపీనియన్ పోల్స్, గత ఎన్నికల చరిత్ర టీఎంసీకి కాస్త పైచేయి ఇస్తున్నప్పటికీ.. బీజేపీ అనూహ్యంగా బలపడుతుండటంతో ‘సిటీ ఆఫ్ జాయ్’లో ఇకపై వన్‌సైడ్ వార్ లేనట్టే. పోలింగ్ శాతం, అభ్యర్థుల ఎంపిక, చివరి నిమిషంలో జరిగే ప్రచార సరళి.. ఇవన్నీ కోల్‌కతాలోని పలు నియోజకవర్గాల్లో మెజారిటీని తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. పార్టీల ఎత్తులు, పైఎత్తులతో కోల్‌కతా పోరు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో..


