
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదన
మ్యూనిక్: యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్ యూరప్’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు.
శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్‌స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు.
‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్ యూరప్’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు.