ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేఖపై పుతిన్ వ్యాఖ్య
సెయింట్ పీటర్స్‌బర్గ్: ఉక్రెయిన్‌పై నాలుగేళ్లుగా సాగిస్తున్న దురాక్రమణకు ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమయ్యారు. అయితే, యుద్ధ విరమణకు ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల్లోని కొన్ని రాజీలకు ఉక్రెయిన్ అంగీకరించాల్సి ఉంటుందన్నారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముఖాముఖి చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం బహిరంగ లేఖ రాశారు.
‘చర్చలకు ముందుగా పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఉక్రెయిన్, రష్యా మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే శాంతి సాధ్యం. మనిద్దరి మధ్య ముఖాముఖి చర్చలు జరగాలని ప్రతిపాదిస్తున్నా’అని జెలెన్‌స్కీ అందులో పేర్కొన్నారు. ఈ లేఖ అందిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ గురువారం రాత్రి పీటీఐ తదితర ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు.
‘శాంతి నెలకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే, గతేడాది ఆగస్ట్‌లో అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ కొన్ని రాజీలను ప్రతిపాదించారు. అందుకు రష్యా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ కూడా ఆయన చేసిన రాజీ ప్రతిపాదనలకు అంగీకరించాల్సి ఉంటుంది. అది జరిగిన పక్షంలో ఈ సంక్షోభం త్వరగా సమసిపోతుంది’అని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అంగీకరించాల్సిన రాజీ ప్రతిపాదనలు ఏమిటనే విషయం మాత్రం పుతిన్ వివరించలేదు. ఉక్రెయిన్, రష్యాల మధ్య సంక్షోభంలో యూరప్ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఎన్నో ఏళ్లుగా రష్యాను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ దేశాలు ఈ సంక్షోభ పరిష్కారంలో చిత్తశుద్ధి వ్యవహరిస్తాయనే నమ్మకం తమకు లేదని తెలిపారు.
ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్ ప్రాంతాన్ని పూర్తిగా, డొనెట్‌స్‌్కను 85 శాతం, జపొరిజియాను 80 శాతం ఇప్పటికే నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ రాజీకి వచ్చి, యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఇటీవల ఉక్రెయిన్ బలగాలను వెనక్కి తరిమికొట్టి 2,440 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ బలగాలు ఆక్రమించుకున్నాయని ఆయన వివరించారు. యుద్ధక్షేత్రంలో ప్రతి చోటా తమ సైన్యం ముందుకు సాగుతోందన్నారు. అదేవిధంగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడులను నిలువరించేందుకు గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ముఖాముఖి చర్చలకు పుతిన్ నో
ముఖాముఖి చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇచ్చిన ఆఫర్‌ను పుతిన్ తిరస్కరించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ..చర్చల కోసం జెలెన్‌స్కీ బహిరంగంగా లేఖ రాయడాన్ని అమర్యాదకరమైన చర్యగా పుతిన్ అభివరి్ణంచారు. ‘ఇదసలు వ్యక్తిగత సమావేశాలు, చర్చలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించే మార్గమా? లేక అసలు ఎలాంటి ముఖాముఖి చర్చలు సాధ్యం కాకుండా చేసే వాతావరణాన్ని సృష్టించడమా? నాకైతే జరగాల్సిన సమావేశాలను సైతం జరక్కుండా చేయడమే దీని వెనుక అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది’అంటూ పుతిన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి సమావేశంతో కలిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదన్నది తన నమ్మకమన్నారు.


