breaking news
International Economic Forum
-
పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్ వెనుకబడింది. అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ‘గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్‌ను అధిగమించినట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అంతర్జాతీయంగా అత్యంత పోటీపడగల ఆర్థిక వ్యవస్థగా సింగపూర్ అవతరించి ఆశ్చర్యపరించింది. ఈ విషయంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టింది. బ్రిక్స్‌లోని ఐదు దేశాల్లో భారత్, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థల ర్యాంకులే తక్కువగా ఉండడం గమనార్హం. ఈ సూచీలో బ్రెజిల్ 71వ స్థానంలో ఉంది. అయితే, స్థూల ఆర్థిక అంశాల పరంగా స్థిరత్వం, మార్కెట్ సైజు పరంగా భారత్ ర్యాంకు ఉన్నత స్థానంలోనే ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. వాటాదారుల గవర్నెన్స్ విషయంలో అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచింది. 103 అంశాల ఆధారంగా గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో స్థానాలను డబ్ల్యూఈఎఫ్ ఏటా నిర్ణయిస్తుంటుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది. -
‘ఉగ్ర’ సాయం ఆగాలి
పాక్‌పై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు ► మానవాళికి ఉగ్రవాదం పెనుముప్పు ► భారత్‌లో పెట్టుబడులకు ఆకాశమే హద్దు ► అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికలో మోదీ ప్రసంగం సెయింట్ పీటర్స్బర్గ్: విశ్వమానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదానికి నిధులు, ఆయుధాల సరఫరాపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కశ్మీరీ మిలిటెంట్లకు పాకిస్తాన్ మద్దతుగా నిలవడాన్ని ప్రస్తావిçస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికగా ప్రసంగిస్తూ.. ‘ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు. ప్రపంచానికి ఉగ్రవాదం హానికారికంగా మారింది. ఇలాంటి రక్కసితో పోరాడేందుకు అందరూ ఏకమవ్వాలి’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదులు ఆయుధాలు తయారు చేసుకోలేరు, నోట్లు ముద్రించుకోలేరు. కానీ కొన్ని దేశాలు వారికి తుపాకులు సరఫరా చేస్తున్నాయి, మనీలాండరింగ్ ద్వారా వారికి ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తున్నాయి’ అని మండిపడ్డారు. భారత్ 40 ఏళ్లుగా సీమాంతర ఉగ్రవాదంతో బాధపడుతోందని.. వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ కూడా పాల్గొన్న ఈ వేదిక ద్వారా ‘ఉగ్రవాదానికి నిర్వచనం ఇవ్వటంలో 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ దశగా ఐరాస ముందు ఉగ్రవాదం, వారికి సహకరిస్తున్న వారిపై తీర్మానం పెండింగ్‌లో ఉంది. ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదు. ఏ నిర్ణయమూ తీసుకోలేదు’ అని మోదీ విమర్శించారు. చైనాతో 40 ఏళ్లుగా సరిహద్దు సమస్యలున్నా.. ఇంతవరకు ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదని తెలిపారు. ‘ప్రస్తుత ప్రపంచం అనుసంధానిత, పరస్పర ఆధారితం. అందుకే సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం’ చెప్పారు. ఆకాశమే హద్దుగా.. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు విస్తృత అవకాశాలు 120 కోట్ల ప్రజల మార్కెట్ ఉన్న భారత్‌కు పెట్టుబడులతో రావాలని ప్రపంచ వ్యాపారవేత్తలను మోదీ కోరారు. ‘భారత్‌లో వ్యాపారానికి ఆకాశమే హద్దు. మీకు నచ్చిన రంగంలో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు.. రక్షణరంగ తయారీ, పర్యాటకం, సేవలు, వైద్యపరికరాల తయారీలోనూ భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. 125కోట్ల జనాభా ఉన్న దేశం ప్రపంచాన్ని స్వాగతిస్తోంది. ప్రపంచ పురాతన దేశమైన భారత్ ఆర్థికాభివృద్ధికోసం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారానికి ఆకాశమే హద్దు’ అని అన్నారు. ఓ భారత ప్రధాని అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనటం ఇదే తొలిసారి. ‘కూడంకుళం’ ఖర్చు 50వేల కోట్లు భారత్‌కు ఎస్–400 మిసైల్ వ్యవస్థను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ఉప ప్రధాని రోగోజిన్ తెలిపారు. ఈ దిశగా భారత అధికారులతో ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు. అటు, కూడంకుళంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి 50వేల కోట్ల రూపాయలు ఖర్చుకానుంది. విమానాలు, అటోమొబైల్స్ తదితర 19 రంగాల్లో రంగాల్లో ఇరుదేశాలు సంయుక్త భాగస్వామ్యంతో తయారీ చేపట్టేందుకు భారత్–రష్యాలు అంగీకరించాయి. నాగ్‌పూర్–సికింద్రాబాద్ హైస్పీడ్ లింక్ నిర్మాణావకాశాలౖ అధ్యయనం పైనా ఒప్పందం కుదిరింది. ‘ఉర్గా కంజూర్’ బహూకరణ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దస్తాన్ గుంజ్‌చోయ్‌నీ బౌద్ధాలయాన్ని సందర్శించిన మోదీ అక్కడి పూజారి జంపా డోనార్‌కు టిబెట్ బౌద్ధగ్రంథాలైన ‘ఉర్గా కంజూర్’లోని 100 సంపుటాలను బహూకరించారు. 1955 వరకు ప్రపంచానికి పరిచయంలేని వీటిని మంగోలియన్ ప్రధాని.. భారత ప్రొఫెసర్ రఘు వీరాకు బహూకరించారు. రష్యా పర్యటన తర్వాత మోదీ ఫ్రాన్స్ బయలుదేరారు. ‘మోదీకి ట్వీటర్ అకౌంట్ ఉందా?’ సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచంలోనే అత్యధిక ట్వీటర్ ఫాలోవర్లలో ప్రధాని నరేంద్ర మోదీది రెండో స్ధానం. కానీ అమెరికా జర్నలిస్టు మెగిన్ కెల్లీకి ఈ విషయం తెలియదట. అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు ముందు పుతిన్, మోదీలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఇంటర్వూ్యలో నేరుగా మోదీని ‘మీకు ట్వీటర్ అకౌంట్ ఉందా?’ అని అడిగారామె. దీంతో మోదీ చిరునవ్వు నవ్వి ఇంటర్వూ్యను కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా విస్తృతమైంది. దీంతో ముఖ్యమైన నేతలతో ఇంటర్వూ్యకు ముందు కనీస స్థాయిలోనూ సిద్ధం కాలేరా? అని కొందరు సామాజిక మాధ్యమాల్లో కెల్లీని ప్రశ్నించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పాత్ర లేదని పుతిన్ చెప్పటాన్ని సమర్థిస్తున్నారా అన్న కెల్లీ ప్రశ్నకు ‘ట్రంప్, హిల్లరీ, మెర్కెల్, పుతిన్ వంటి గొప్ప నాయకుల గురించి మాట్లాడుతున్నారు. వీరి మధ్యలో నాలాంటి న్యాయవాది అవసరం లేదనుకుంటా’ అని మోదీ సమాధానమిచ్చారు.