పార్లమెంట్‌కు అనుకోని అతిథి; పరుగులు పెట్టిన ఎంపీలు

మాడ్రిడ్: స్పెయిన్ దేశంలోని అండలూసియా పార్లమెంట్‌లో ఒక ఎలుక హల్‌చల్ చేసింది. సమావేశాల్లో భాగంగా కీలక ఓటింగ్ నిర్వహిస్తున్న దశలో ఎవరు ఊహించని విధంగా టేబుల్‌పైకి చేరిన ఎలుక.. అక్కడి ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
విషయంలోకి వెళితే.. కొన్ని రోజులుగా పెండింగ్‌లో పడిపోయిన ఒక ముఖ్యమైన తీర్మానంపై బుధవారం ఎంపీలు ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఓటింగ్‌కు సంబంధించి స్పీకర్ మార్తా బోస్కెట్ సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపీలు కూర్చున్న టేబుల్‌పైకి ఎక్కింది. దానిని చూసిన స్పీకర్ షాక్ తిన్నారు. ఏమైందో అని మిగతా సభ్యులు కూడా అటు ఇటూ చూశారు. ఇంతలో ఎలుక పరిగెత్తడం చూసి కొంతమంది ఎంపీలు ఉరుకులు పరుగులు పెట్టగా.. మరికొందరు టేబుళ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా తంటాలు పడి ఎలుకను బయటకు పంపించి ఓటింగ్ ప్రక్రియను తిరిగి నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This is the moment when a rat causes havoc in Andalusia's parliament in Spain 🐀 pic.twitter.com/PypFRWvQfQ
— Reuters (@Reuters) July 21, 2021