కలకలం రేపుతున్న కొత్త వ్యాధి.. నీటితో జాగ్రత్త.. సోకితే బతకడం కష్టమే!

USA: Man In Florida Killed By Brain Eating Amoeba In Tap Water - Sakshi

ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఆ వైరస్‌ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అయితే అక్క‌డ‌క్క‌డ వెలుగుచూస్తున్న కొత్త వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డి ఫ్లోరిడాలో ఓ వ్య‌క్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఒక వ్యక్తి తన ముక్కును పంపు నీటితో కడుక్కోవడంతో వైరస్‌ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.

అరుదైన వ్యాధి.. సోకితే కష్టమే!
బ్రెయిన్ తినే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలెరీ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ధృవీకరించింది. ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రజలు వైరస్‌ బారినపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.  సీడీసీ ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ఈ అమీబా సోకితే మెదడుని తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్‌ (అమీబా) ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. అక్కడ అది జీవి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది, ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మాన‌సిక స‌మ‌తుల్య‌త దెబ్బ‌తిన‌డం వంటివి కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

154 మందిలో బయటపడింది కేవలం నలుగురు
ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97 శాతం మంది మరణించారని, 1962-2021 మధ్య కాలంలో యూఎస్‌లో 154 మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు.

చదవండి: టికెట్‌ బుకింగ్‌ సమయంలో షాక్‌.. ఐఆర్‌సీటీసీపై యూజర్లు ఫైర్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top