Imran Khan: అవసరాల కోసం అమెరికా వాడుకుంటోంది!

US sees Pakistan useful only for clearing mess in Afghanistan Says Imran Khan - Sakshi

ఇస్లామాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కే ప్రాధాన్యం ఇస్తుందని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.  అఫ్గాన్‌లో వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే తమ దేశాన్ని వాడుకుంటోందని విమర్శించారు.

అఫ్గాన్‌ నుంచి అమెరికా తమ దళాల్ని ఉపసంహరించిన తర్వాత ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటూ ఉండడంతో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ‘‘అఫ్గాన్‌లో అమెరికా 20 ఏళ్ల పాటు మిలటరీ చర్యలు తీసుకున్నా ప్రయోజనమేమీ కలగలేదు. ఇప్పుడు బలగాల ఉపసంహరణతో పరిస్థితులు మరింత క్షీణించాయి. తాను సృష్టించిన ఈ గందరగోళాన్ని చక్కదిద్దడానికే పాకిస్తాన్‌ను అమెరికా వాడుకుంటోంది. భారత్‌తో బంధం బలపడ్డాక మాతో వ్యవహరించే తీరులోనే చాలా మార్పు వచ్చింది’’ అని ఇమ్రాన్‌ఖాన్‌ విదేశీ జర్నలిస్టుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌ అధ్యక్షుడిగా అష్రాఫ్‌ ఘనీ ఉన్నంత కాలం తాలిబన్లు అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరపరని, దాని వల్ల సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. మరోవైపు జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు మర్యాదపూర్వకంగానైనా ఫోన్‌ చేసి మాట్లాడకపోవడంపై ఆ దేశం ఇంకా గుర్రుగానే ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top