అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! | US Scientists Achieve Nuclear Fusion Energy Breakthrough | Sakshi
Sakshi News home page

అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది!

Dec 14 2022 3:33 AM | Updated on Dec 14 2022 1:11 PM

US Scientists Achieve Nuclear Fusion Energy Breakthrough - Sakshi

శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగంలో నభూతో అనదగ్గ అతి కీలక ముందడుగు! అంతర్జాతీయంగా ఇంధన రంగ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేయగల పరిణామం!! మహా మహా శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడంలో సైంటిస్టులు తొలిసారిగా విజయవంతమయ్యారు. కాలిఫోర్నియాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులు చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత సాధించారు. సంలీన ప్రక్రియలో అత్యంత కీలకమైన, పరిశోధకులంతా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న ‘నికర శక్తి లాభం’ సాధించి చూపించారు.

సంలీన ప్రక్రియను ప్రారంభించేందుకు వెచ్చించాల్సిన శక్తి కంటే, ప్రక్రియ ద్వారా పుట్టుకొచ్చే శక్తి పరిమాణం ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు. అమెరికా ఇంధన మంత్రి జెన్నిఫర్‌ గ్రాన్‌హోం మంగళవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌ శాస్త్ర సలహాదారు ఆర్తీ ప్రభాకర్, పరిశోధకుల బృందంతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయమిది. మా పరిశోధకుల బృందం తమ కెరీర్లతో పాటు జీవితాలను కూడా అంకితం చేసి పాటుపడి ఎట్టకేలకు సాధించింది.

ఇంతకాలంగా మనమందరం కలలుగన్న కేంద్రక సంలీన ప్రక్రియను నిజం చేసి చూపించింది. ఇది ఈ రంగంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు తెర తీయనుంది’’ అని చెప్పారు. ఈ పరిశోధన రక్షణ రంగంలో కనీవినీ ఎరగనంతటి విప్లవాత్మక మార్పులకు తెర తీయడమే గాక విద్యుచ్ఛక్తితో సహా భవిష్యత్తులో మానవాళి మొత్తానికీ సరిపడా స్వచ్ఛ ఇంధనాన్ని సునాయాసంగా తయారు చేసుకునేందుకు కూడా వీలు కల్పించగలదని అమెరికా ఇంధన శాఖ ఒక ప్రకటనలో ఆశాభావం వెలిబుచ్చింది. ఎంతకాలమైనా సహనం కోల్పోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి అద్భుతాలైనా సాధ్యమేననేందుకు ఈ ఫలితమే ఉదాహరణ అని ఆర్తీ అన్నారు.
 
ఏమిటీ కేంద్రక సంలీనం?
కేంద్రక సంలీనం అంటే రెండు చిన్న పరమాణువుల కేంద్రకాలు కలిసిపోయి, అంటే సంలీనం చెంది ఒకే పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. అలా ఏర్పడ్డ సదరు కేంద్రకం తాలూకు ద్రవ్యరాశి ఆ రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే తక్కువగా ఉంటుంది. ఆ మిగులు ద్రవ్యరాశి అపార శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది జరగాలంటే అపారమైన శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. సూర్యునిలోనూ, ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి ఈ కేంద్రక సంలీనమే మూలం. వాటిలోని అపార ఉష్ణోగ్రతలు ఇందుకు వీలు కల్పిస్తాయి. హైడ్రోజన్‌ బాంబు తయారీ సూత్రం కూడా ఇదే. అదే అణు బాంబు తయారీలో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను అనుసరిస్తారు. అందులో ఒకే అణువు తాలూకు కేంద్రకం చిన్న భాగాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో విపరీతమైన శక్తి పుట్టుకొస్తుంది.

తాజా ఆవిష్కరణ ప్రత్యేకత ఏమిటంటే...
సూర్యుడు, ఇతర తారల్లోనూ హైడ్రోజన్‌ బాంబు తయారీలోనూ కేంద్రక సంలీన చర్య అనియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్‌ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతూ ఉంటాయి. దీన్ని గనక నియంత్రిత వాతావరణంలో జరపగలిగితే అపారమైన శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా భూమిపై మానవాళి మొత్తానికీ సరిపడా విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేయొచ్చు! అది కూడా అతి చౌకగా, ఎలాంటి రేడియో ధార్మిక తదితర కాలుష్యానికీ తావు లేకుండా!! తాజాగా అమెరికా సైంటిస్టులు స్వల్ప పరిమాణంలోనే అయినా సరిగ్గా దాన్నే సాధించి చూపించారు. హైడ్రోజన్‌ ఐసోటోప్‌లైన డ్యుటీరియం, ట్రిటియంలను సంలీనం చెందించారు. ‘‘ఇతర సంలీనాలతో పోలిస్తే వీటి సంలీనానికి తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. పైగా చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుంది’’ అని యూఎస్‌ ఇంధన శాఖ పేర్కొంది.

ప్రయోజనాలు అనంతం!
కేంద్రక సంలీన ప్రక్రియను శాస్త్రవేత్తలు ఏనాడో అవగాహన చేసుకున్నారు. భూమిపై దీన్ని చేసి చూసేందుకు 1930ల నుంచే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటిపై పలు దేశాలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ‘‘ఇంధనపరంగా చూస్తే కేంద్రక సంలీనం తాలూకు ప్రయోజనాలు అనంతమనే చెప్పాలి. ఎందుకంటే అణు విద్యుదుత్పత్తికి అనుసరించే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా విడులయ్యే రేడియోధార్మిక వ్యర్థాలకు సంలీనంలో అవకాశమే ఉండదు. కాబట్టి మానవాళి మొత్తానికీ అవసరమయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని అపరిమితంగా, కారుచౌకగా అందించడం సాధ్యపడుతుంది’’ అని కాలిఫోర్నియా వర్సటీ ఇంధన విభాగ ప్రొఫెసర్‌ డేనియల్‌ కామెన్‌ వివరించారు. అయితే ఇది సాకారమయ్యేందుకు ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement