దడ పుట్టించిన చేజింగ్‌ | US jets pursue light aircraft over Washington DC before it crashes in Virginia | Sakshi
Sakshi News home page

దడ పుట్టించిన చేజింగ్‌

Jun 6 2023 5:57 AM | Updated on Jun 6 2023 6:19 AM

US jets pursue light aircraft over Washington DC before it crashes in Virginia - Sakshi

కూలింది ఈ రకం విమానమే

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఓ చిన్న విమానాన్ని జెట్‌ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్‌ శబ్ధం వాషింగ్టన్‌ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్‌ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్‌ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్‌టన్‌ నుంచి బయలుదేరింది. లాంగ్‌ ఐల్యాండ్‌లోని మెక్‌ ఆర్థర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌ మీదుగా, సరాసరి వాషింగ్టన్‌ డీసీ వైపుగా వచ్చింది.  

దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్‌ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్‌–16 జెట్‌ విమానాన్ని పంపారు. అది సోనిక్‌ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్‌తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్‌ దృష్టిలో పడేందుకు ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్‌ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది.

ఫ్లోరిడాకు చెందిన ఎన్‌కోర్‌ మోటార్స్‌ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్‌ రంపెల్‌ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్‌తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్‌ కరోలినా నుంచి ఈస్ట్‌ హాంప్టన్‌కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్‌జెట్‌ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్‌ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement