H-1B Visa: లాటరీ ద్వారానే హెచ్‌–1బీ వీసాలు

US court sets aside proposed Trump-era rule on H-1B visa selection - Sakshi

ట్రంప్‌ హయాంలో చేసిన ప్రతిపాదిత సవరణల్ని కొట్టేసిన జడ్జి

భారతీయులకు భారీగా ఊరట

వాషింగ్టన్‌: భారతీయులకు భారీగా ఊరట కలిగేలా అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతి ద్వారా హెచ్‌–1బీ వీసాల మంజూరుకు బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల్ని అమెరికా ఫెడరల్‌ జడ్జి కొట్టేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నీ ఉపయోగించుకొని వలస విధానంలో ఎన్నో మార్పుల్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడానికి వేతనాల అధారంగా హెచ్‌–1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని కాలిఫోరి్నయాలోని  జిల్లా కోర్టుకు చెందిన ఫెడరల్‌ న్యాయమూర్తి జడ్జి జెఫ్రీ ఎస్‌ వైట్‌ కొట్టేశారు. అప్పట్లో  తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా చాద్‌ వుల్ఫ్‌ నియామకం చట్టబద్ధంగా జరగలేదని, అందుకే ఆయన ఆధ్వర్యంలో చేసిన ఈ సవరణల్ని కొట్టేస్తున్నట్టుగా న్యాయమూర్తి స్పష్టం చేశారు.

వేతనాల ఆధారంగా  హెచ్‌–1బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గి పోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని పేర్కొంటూ అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రంప్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్‌ న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో భారతీయులకు భారీగా ఊరట లభించింది. ఐటీ కంపెనీలు హెచ్‌–1బీ వీసా మీద భారత్, చైనా నుంచి భారీ సంఖ్యలో టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తుంటాయి.

ట్రంప్‌ తీసుకువచ్చిన సవరణల ప్రకారం వేతనాల ఆధారంగా వీసాలు ఇస్తే కనుక అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకొనే వారికి మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాదు. అందుకే టెక్‌ కంపెనీలన్నీ ఈ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీ ఏడాది 65 వేల హెచ్‌–1బీ వీసాలను మంజూరు చేస్తారు. దానికి అదనంగా మరో 20 వేల వీసాలు అడ్వాన్స్‌ డిగ్రీ ఉన్న వారికి ఇస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట అన్నవిధానంతో పాటు లాటరీ విధానం ద్వారా ఈ వీసాలను మంజూరు చేస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top