breaking news
Court of Justice
-
H-1B Visa: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు
వాషింగ్టన్: భారతీయులకు భారీగా ఊరట కలిగేలా అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతి ద్వారా హెచ్–1బీ వీసాల మంజూరుకు బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల్ని అమెరికా ఫెడరల్ జడ్జి కొట్టేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నీ ఉపయోగించుకొని వలస విధానంలో ఎన్నో మార్పుల్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో విదేశాల నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడానికి వేతనాల అధారంగా హెచ్–1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని కాలిఫోరి్నయాలోని జిల్లా కోర్టుకు చెందిన ఫెడరల్ న్యాయమూర్తి జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ కొట్టేశారు. అప్పట్లో తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా చాద్ వుల్ఫ్ నియామకం చట్టబద్ధంగా జరగలేదని, అందుకే ఆయన ఆధ్వర్యంలో చేసిన ఈ సవరణల్ని కొట్టేస్తున్నట్టుగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. వేతనాల ఆధారంగా హెచ్–1బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గి పోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని పేర్కొంటూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో భారతీయులకు భారీగా ఊరట లభించింది. ఐటీ కంపెనీలు హెచ్–1బీ వీసా మీద భారత్, చైనా నుంచి భారీ సంఖ్యలో టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తుంటాయి. ట్రంప్ తీసుకువచ్చిన సవరణల ప్రకారం వేతనాల ఆధారంగా వీసాలు ఇస్తే కనుక అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకొనే వారికి మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాదు. అందుకే టెక్ కంపెనీలన్నీ ఈ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ వీసాలను మంజూరు చేస్తారు. దానికి అదనంగా మరో 20 వేల వీసాలు అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వారికి ఇస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట అన్నవిధానంతో పాటు లాటరీ విధానం ద్వారా ఈ వీసాలను మంజూరు చేస్తారు. -
‘గోప్యత’ ఎలాంటి హక్కు?
పౌరులు జరిపే సమస్త లావాదేవీలకూ ప్రభుత్వాలు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న తరుణంలో అసలు వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పెట్టింది. వివిధ పథకాలకూ, లావాదేవీలకూ ఆధార్ తప్పనిసరి చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుండగా ముందు ఈ సమస్యను తేల్చడం అవసరమన్న నిర్ణయానికొచ్చింది. ఈ విషయంలో వచ్చే స్పష్టతను బట్టి ఆధార్ చెల్లుబాటు సంగతి తేలుతుంది. ఆధార్ ఉనికిలోకి వచ్చి నప్పటినుంచి దాని చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉన్నాయి. 2009 జనవరిలో కేవలం పాలనాపరమైన ఒక ఉత్తర్వు ద్వారా మొదలైన ఆధార్ ఉన్నకొద్దీ బలం పుంజుకుంది. 2010లో దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును ఆ మరుసటి సంవత్సరం పార్లమెంటు స్థాయీ సంఘం తిరస్కరించాక ఇది ఆగినట్టు కనబడినా స్వల్ప కాలంలోనే చకచకా కదిలింది. పార్లమెంటులో చర్చించకుండా, దాని ఆమోదం పొందకుండా కేవలం పాలనా ఉత్తర్వుపై అమల్లోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమంటూ 2012లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆధార్ వల్ల పౌరుల డేటా అసాంఘిక శక్తుల చేతుల్లో పడొచ్చునని, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లవచ్చునని పిటిషనర్లు వాదించారు. ఈ కేసు విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ పౌరులకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని, ఏ సంక్షేమ పథకాన్ని వారికి నిరాకరిం చవద్దని న్యాయమూర్తులు సూచించడం... అందుకు ప్రభుత్వం అంగీకరించడం పూర్తయినా ఆధార్ దూకుడు ఆగింది లేదు. మొదట రేషన్‌కూ, వంటగ్యాస్‌కూ మినహా మరే ఇతర అంశాలకూ వర్తింపజేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టు గత నెలలో పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించడం విషయంలో సానుకూలంగానే స్పందించింది. ఆధార్ ఉన్నవారు అనుసంధానించుకోవాలని, లేనివారు ఆ పని చేయనవసరం లేదని చెప్పడం వల్ల సారాంశంలో చాలామందికి అది తప్పనిసరే అయింది. అసలు సుప్రీంకోర్టు దృష్టికి రాకుండా ఆధార్‌తో ముడిపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇలా సాగుతుండగానే, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడకుండానే ఆధార్ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం కూడా పూర్తయ్యాయి. తగిన మెజారిటీ లేని కారణంగా రాజ్యసభలో గట్టెక్కలేమనుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ద్రవ్య బిల్లుగా చూపింది. ఒకపక్క ఆధార్ తీరుతెన్నులపైనా, దాని రాజ్యాంగబద్ధతపైనా, ఈ పథకంలో ఇమిడి ఉన్న వ్యక్తిగత గోప్యత అంశంపైనా సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తుండగానే ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోవడం ఎలా చూసినా సమర్ధనీయం కాదు. ఆధార్ పథకం, దాని చెల్లుబాటు సంగతలా ఉంచి ఇప్పుడు అసలు వ్యక్తిగత గోప్యత ఏ రకమైన హక్కు అనే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించ బోతోంది. దీన్ని తేల్చడానికి మంగళవారం తొమ్మిదిమంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పర్చడం, అది బుధవారం నుంచే విచారణ మొదలు పెట్టడం గమనార్హమైన విషయం. రాగల రెండురోజుల్లో ఈ ధర్మాసం దీనిపై తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆధార్ చట్టబద్ధతను అయి దుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలిస్తుంది. వ్యక్తిగత గోప్యత అన్నది పౌరులకుండే చట్టపరమైన హక్కే తప్ప రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదిస్తున్నారు. ఆ రకమైన హక్కే అయిన పక్షంలో మన రాజ్యాంగ నిర్మాతలు దాన్ని స్పష్టంగా చెప్పేవారన్నది ఆయన వాదన. రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు గనుక అది ప్రాథమిక హక్కు కాదనడం తార్కికంగా ఆమోదయోగ్యం కాదని ధర్మాసనంలోని జస్టిస్ చలమేశ్వర్ అనడం గమనించదగ్గది. మన సమాజం ఏ దిశగా పయనించాలని... ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారన్నదే న్యాయస్థానాలకు ప్రధానం. రాజ్యాంగాన్ని సృజనాత్మకంగా అన్వయించడంలో న్యాయమూర్తులకు అదే గీటురాయి. అందులో భాగంగానే జీవించే హక్కుకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిని వివిధ తీర్పుల ద్వారా సుప్రీంకోర్టు గతంలో విస్తరించింది. జీవించే హక్కంటే కేవలం ప్రాణానికి సంబంధించిన హక్కు మాత్రమే కాదని, అది గౌరవప్రదంగా జీవించే హక్కు కూడానని మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి అగ్నివేష్ నేతృత్వంలోని వెట్టి కార్మికుల విముక్తి సంస్థ కేసులో అయితే దోపిడీకి గురికాకుండా ఉండటం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య కరమైన వాతావరణంలో ఎదిగేందుకు పిల్లలకు అవకాశం కల్పించడం వగైరాలు కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తాయని తెలిపింది. అలాగే పనిచేసే స్థలాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండటం కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తుందని మరో తీర్పులో వివరించింది. రాజ్యాంగంలో పొందుపరచ లేదు గనుక వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్న అటార్నీ జనరల్ వాదనను అంగీకరిస్తే ఈ హక్కులన్నీ ‘ప్రాథమిక హక్కు’ పరిధిలోకి రాకుండా పోతాయి. 1954లో ఒకసారి, 1963లో మరోసారి ఇచ్చిన వేర్వేరు తీర్పుల్లో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పి ఉండొచ్చు. అయితే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విస్తృత కోణంలో మరోసారి ఆ తీర్పులను పరిశీలించవలసిన సమయం ఆసన్నమైంది. మొదటి కేసును 8మంది న్యాయమూర్తుల ధర్మాసనం, రెండో కేసును ఆరుగురు న్యాయమూర్తుల ధర్మా సనం పరిశీలించి తీర్పులను ఇచ్చాయి గనుక ఇప్పుడు అంతకన్నా అధిక సంఖ్యలో న్యాయమూర్తులుండే ధర్మాసనం ఏర్పాటు అవసరమైంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పరిగణిస్తే ఆధార్ ‘సకారణమైన పరిమితి’ కిందికే వస్తుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటుంది. ఏం జరుగు తుందన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది. -
న్యాయస్థానంలోనే లంచం
మెదక్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన బెంచ్‌క్లర్క్ మెదక్: సాక్షాత్తూ న్యాయస్థానంలోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన లాల్‌సింగ్‌కు సంబంధించి ఓ భూవివాదం(సివిల్) కేసు మెదక్‌లోని మూడో అదనపు జిల్లా కోర్టులో 2009 నుంచి కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ప్రత్యర్థికి సమన్లు పంపించడానికి ఈ కోర్టులో దశాబ్దకాలంగా సూపరింటెండెంట్(బెంచ్ క్లర్క్)గా కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటరమణారెడ్డి.. లాల్సింగ్ను రూ.5 వేల లంచం ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో లాల్‌సింగ్ మెదక్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లాల్‌సింగ్ నుంచి వెంకటరమణారెడ్డి లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు.