హెచ్‌4 వీసాదారులకు ఊరట

US Bill Seeks Automatic Work Rights For H-1B Visa Holders - Sakshi

ఇకపై ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు చేసుకునే ఛాన్స్‌

ఆ హక్కు కల్పిస్తూ ప్రతినిధుల సభలో బిల్లు

బిల్లు పాసైతే ఎందరో భారతీయులకు లబ్ధి

వాషింగ్టన్‌: అమెరికాలోని హెచ్‌–4 వీసాదారులు ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే ఒక బిల్లును  కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎందరో భారతీయులతో పాటు, విదేశాల నుంచి వచ్చే జీవిత భాగస్వామ్యులకు మేలు జరుగుతుంది. భర్త లేదా భార్యల వెంట అమెరికాకి వెళ్లే వారు వెంటనే హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. హెచ్‌–1బి, హెచ్‌–2ఏ, హెచ్‌–2బీ, హెచ్‌–3 తదితర వీసాలపై అమెరికా వెళ్లే వారి జీవిత భాగస్వామికి, పిల్లలకి హెచ్‌–4 వీసా ఇస్తారు. ఇన్నాళ్లూ హెచ్‌–4 వీసాదారులు ఉద్యోగాలు చేయాలంటే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కి దరఖాస్తు చేసుకోవాలి.

దానిని పరిశీలించి ఇమ్మిగ్రేషన్‌ శాఖ వర్క్‌ పర్మిట్‌ ఇవ్వడానికి ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. అప్పుడే వారు ఉద్యోగం చేయడానికి వీలు కలిగేది. ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే ఇక వర్క్‌ పర్మిట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసే కార్మికులకు కొరత ఉండడంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగం చేసే అవకాశం లభించేలా ఈ బిల్లుకి రూపకల్పన చేశారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కరోలిన్‌ బూర్‌డెక్స్, మారియా ఎల్విరల సలాజర్‌లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో కార్మికుల కొరత వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోందని వలసదారులకి ఆటోమేటిక్‌గా ఆ హక్కు వస్తే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందని వారు చెప్పారు.

వీసాలు వృథా కాకుండా బిల్లు
ఎవరూ వినియోగించుకోకుండా మిగిలిపోయిన 3 లక్షల 80 వేలకు పైగా కుటుంబ, ఉద్యోగ ఆధారిత వీసాలు వృథా కాకుండా కొందరు కాంగ్రెస్‌ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాలు వినియోగించుకోవడానికి వీలు కల్పించేలా ఒక బిల్లును కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్‌ కార్డు బాక్‌లాగ్‌ల సంఖ్య తగ్గి భారత్, చైనా నుంచి వచ్చి అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 2,22,000 కుటుంబ ఆధారిత వీసాలు, 1,57,000 ఉద్యోగ ఆధారిత వీసాలు ఎవరూ వినియోగించుకోకుండానే మిగిలిపోయాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top