
2,000 కోట్ల ఏళ్లలో సర్వం ముగుస్తుందా?
అవునంటున్న తాజా సిద్ధాంతం
విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్ క్రంచ్’గా సదరు వ్యాసం పేర్కొంది.
డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే (డీఎన్‌ఎస్), డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్‌స్ట్రుమెంట్ (డీఈఎస్‌ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు.
డార్క్ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్–డార్క్ ఎనర్జీ మోడల్ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే.
ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుంది.
ఆయువు 3,330 కోట్ల ఏళ్లు
విశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్