Dark energy
-
హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!
విశ్వంలో ఇంకా ఛేదించాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు విశ్వం ఎలా ఏర్పడింది? ఎంత పెద్దది? భవిష్యత్తులో ఎలా మారబోతోంది? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానాలు లేవు. అలాంటి సమయంలో ఓ అధ్యయనం బాంబును పేల్చింది. విశ్వం విస్తరణ వేగం తగ్గుతోందని.. దాన్ని ముందుకు నడిపిస్తోందని భావిస్తున్న ‘డార్క్ ఎనర్జీ’ సిద్ధాంతంలోనే లోపాలుండొచ్చని పేర్కొంది. దీంతో శాస్త్ర ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. అయితే తాజా పరిశోధన ఆ సందేహాలకు చెక్ పెట్టి పారేసింది.మన విశ్వం విస్తరిస్తోందని శాస్త్రవేత్తలకు చాలా కాలంగా తెలుసు. అయితే 1998లో జరిగిన పరిశోధనలు మరో కీలక విషయాన్ని వెల్లడించాయి. విశ్వం కేవలం విస్తరించడం మాత్రమే కాదు.. ఆ విస్తరణ వేగం కూడా క్రమంగా పెరుగుతోందని గుర్తించారు. ఈ ఆవిష్కరణకు గాను 2011లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఈ వేగవంతమైన విస్తరణ వెనుక పనిచేస్తున్న రహస్య శక్తినే శాస్త్రవేత్తలు "డార్క్ ఎనర్జీ"గా పిలుస్తున్నారు. అయితే అది అసలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు టైప్-1ఏ సూపర్నోవా(Type Ia Supernova) అనే ప్రత్యేక నక్షత్ర పేలుళ్లను పరిశీలిస్తారు. ఇవి దాదాపు ఒకే ప్రకాశంతో పేలుతుండటంతో వాటి దూరాన్ని కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. ఈ లెక్కల ఆధారంగానే డార్క్ ఎనర్జీ ఉనికిపై శాస్త్రవేత్తలు నిర్ణయాలకు వస్తుంటారు.అయితే.. 2025లో దక్షిణ కొరియాకు చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనం శాస్త్ర ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటివరకు విశ్వ విస్తరణను కొలవడానికి ఉపయోగిస్తున్న పద్ధతుల్లో లోపాలుండొచ్చని, డార్క్ ఎనర్జీ పాత్రను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని వాళ్లు వాదించారు. అంతేకాదు.. విశ్వ విస్తరణ వేగం పెరగడం లేదని, ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు లెక్కల పొరపాట్ల వల్ల కనిపించి ఉండొచ్చని సూచించారు. దీంతో ఇన్నేళ్లుగా అంగీకరిస్తూ వచ్చిన సిద్ధాంతాలపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి.అయితే బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు, నోబెల్ విజేతల బృందంతో కలిసి పాత డేటాను మరోసారి పరిశీలించారు. ముఖ్యంగా "టైప్-1ఏ సూపర్నోవా"లపై దృష్టి సారించారు. ఆపై కొరియా అధ్యయనంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని గుర్తించారు. ఒక గ్రామంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడనుకోండి. అదే గ్రామంలో 20 ఏళ్ల యువకుడు కూడా ఉంటాడు. గ్రామం 80 ఏళ్ల పాతది కాబట్టి అందరూ 80 ఏళ్లవాళ్లే అని చెప్పలేం కదా!. అలాగే ఒక గెలాక్సీ చాలా పురాతనమైనది కావచ్చు. కానీ అందులో ఉన్న ప్రతి నక్షత్రం కూడా అంతే పాతదని భావించలేం. 2025లో వచ్చిన అధ్యయనం గెలాక్సీ వయస్సునే అందులో పేలిన నక్షత్రం వయస్సుగా పరిగణించిందని, అక్కడే లెక్క తప్పిందని తాజా పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి విశ్వం ఇప్పటికీ వేగంగానే విస్తరిస్తోందని, డార్క్ ఎనర్జీ సిద్ధాంతం ఇప్పటికీ సరైనదేనని తేల్చారు.డార్క్ ఎనర్జీ అంటే.. సాధారణంగా మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, గ్యాస్, ధూళి వంటి పదార్థం విశ్వంలో కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మిగిలిన భాగంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ వంటి రహస్య అంశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అందులో డార్క్ ఎనర్జీ విశ్వాన్ని మరింత వేగంగా విస్తరించే శక్తిగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.తాజా అధ్యయనం డార్క్ ఎనర్జీ లేదన్న వాదనను కొట్టిపారేసినప్పటికీ.. అది అసలు ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. అంటే.. డార్క్ ఎనర్జీ ఉనికిపై శాస్త్రవేత్తలకు విశ్వాసం పెరిగింది గానీ, దాని అసలు స్వరూపం గుట్టుమాత్రం ఇంకా వీడాల్సి ఉందన్నమాట. -
విశ్వానికి అంతముందా!
విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్ క్రంచ్’గా సదరు వ్యాసం పేర్కొంది. డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే (డీఎన్ఎస్), డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ (డీఈఎస్ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు. డార్క్ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్–డార్క్ ఎనర్జీ మోడల్ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే. ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుంది.ఆయువు 3,330 కోట్ల ఏళ్లువిశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విశ్వానికి అంతముంది!
అనంత విశ్వం మనిషికి ఎప్పుడూ మిస్టరీయే. దాని పుట్టుక, వికాసం, విస్తరణ తదితరాలు ఎప్పుడూ అబ్బురపాటు కలిగించే విషయాలే. సైంటిస్టులు ఎంతగా ప్రయత్నిస్తున్నా వాటి గుట్టుమట్లను నేటికీ విప్పలేకపోయారు. విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా అంతా విశ్వసిస్తూ వస్తున్న సిద్ధాంతం. అది తప్పని, ఇంతటి ‘అనంత’ విశ్వానికీ ఏదోనాటికి అంతం కచ్చితంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి అంటోంది! కృష్ణపదార్థంపై జరిగిన విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన కొత్త వివరాల ఆధారంగా ఈ మేరకు తేల్చింది! కృష్ణ పదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ ఆస్కారం లేకుండా స్థిరంగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. అందుకే దాన్ని అంతరిక్ష స్థిరాంకమనీ అంటారు. కానీ ఆ భావన నిజం కాదని, కృష్ణపదార్థం నానాటికీ విస్తరిస్తోందని అధ్యయనంలో తేలింది! దీనిపై ఖగోళ శాస్త్రవేత్తల్లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘విశ్వావిర్భావపు గుట్టును కనిపెట్టేందుకు, పలు అంతరిక్ష రహస్యాల చిక్కుముళ్లను విప్పేందుకు ఇది అత్యంత కీలక ఆధారం కానుంది. అంతేగాక మొత్తంగా విశ్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అవగాహననే సమూలంగా మార్చేయగలదు’’ అని వారంటున్నారు. ఏమిటీ పదార్థం? డార్క్ ఎనర్జీ. కృష్ణపదార్థం. అనంత విశ్వంలో మూడొంతులకు పైగా విస్తరించిన పదార్థం. అయినా ఇప్పటికీ మనిషికి అంతుచిక్కని, అతని మేధకు అందని దృగి్వషయం. దాని ఉనికి వాస్తవమే అయినా నిజానికి అదేమిటో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విశ్వ విస్తరణను వేగవంతం చేసే శక్తిగా కృష్ణపదార్థాన్ని సైంటిస్టులు నిర్వచిస్తారు. దాని ఆనుపానులను కనిపెట్టేందుకు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ కొలాబరేషన్ (దేశీ) పేరుతో నాలుగేళ్ల క్రితం 900 మంది అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు బృందంగా ఏర్పడ్డారు. అరిజోనాలోని టక్సన్ అబ్జర్వేటరీలో మేయల్ టెలిస్కోప్ తాలూకు దాని 5,000 ఫైబర్ ఆప్టిక్ లెన్సుల సాయంతో అంతరిక్షాన్ని ఆమూలాగ్రం వడపోస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 5 వేలకు పైగా గెలాక్సీల నుంచి వెలువడే కాంతిని ఏకకాలంలో పరిశీలిస్తున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది సర్వే పూర్తయ్యేనాటికి దేశీ ఏకంగా 5 కోట్ల గెలాక్సీల నుంచి వచ్చే కాంతిని ‘దేశీ’ లెక్కగట్టనుంది! 1,180 కోట్ల ఏళ్ల పై చిలుకు వికాస క్రమంలో విశ్వాన్ని కృష్ణపదార్థం ఎలా ప్రభావితం చేస్తూ వచ్చిందో తేల్చడమే ఈ అధ్యయన లక్ష్యం. మూడేళ్ల ‘దేశీ’ డేటాను సైంటిస్టులు తాజాగా విశ్లేషించారు. అది అందజేసిన 1.5 కోట్ల గెలాక్సీల కాంతికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేశారు. ఫలితంగా ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు దేశీ సహ సారథి, డాలస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ముస్తఫా ఇషాక్ బౌషాకీ తెలిపారు. ‘‘కృష్ణపదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ లోనవదన్నది వాస్తవం కాదు. అది విస్తరిస్తోందని, అంతేగాక అప్పుడప్పుడూ అనూహ్యంగా కూడా ప్రవర్తిస్తోందని వెల్లడైంది. ఆ క్రమంలో కృష్ణపదార్థం కొన్నిసార్లు బలహీనపడుతోంది కూడా. ఆ లెక్కన అంతిమంగా విశ్వంపై దాని ప్రభావం క్రమంగా క్షీణిస్తూ ఏదో ఒకనాటికి సున్నా అవుతుంది. మరోలా చెప్పాలంటే విశ్వ విస్తరణ వేగం క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా నిలిచిపోతుంది. అక్కడినుంచి విశ్వం కుంచించుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. అది క్రమంగా వేగం పుంజుకుని ఒకనాటికి ఈ విశ్వపు ఉనికే లేకుండా పోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఇదంతా జరిగేందుకు కనీసం కొన్ని వందల కోట్ల ఏళ్లకు పైగా పట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కృష్ణశక్తి అభూతకల్పనేనా?
లండన్: మొత్తం విశ్వంలో దాదాపు 68 శాతం ఆవరించి ఉందని చెబుతున్న కృష్ణశక్తి(డార్క్ ఎనర్జీ) అభూతకల్పన అయి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1920 నుంచి గెలాక్సీల వేగాన్ని గమన్నిస్తున్న శాస్త్రవేత్తలు విశ్వం తన పరిధిని విస్తరిస్తుందని కనుగొన్నారు. విశ్వం చిన్న బిందువు దగ్గర ప్రారంభమైందని వారంటున్నారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో శాస్త్రవేత్తలు గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికలకు అవసరమైన కంటికి కనిపించని కృష్ణ పదార్థాన్ని(డార్క్ మేటర్) కనుగొన్నారు. మొత్తం విశ్వంలో 27 శాతం కృష్ణపదార్థం ఉందని అంచనా. 1990ల్లో మరుగుజ్జు నక్షత్రాల పేలుళ్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మొత్తం విశ్వంలో 68 శాతం కృష్ణశక్తి ఉందని, విశ్వం తన పరిధిని పెంచుకోవడంలో ఇదే సహాయపడుతుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు కృష్ణశక్తి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.


