గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్‌ ఉక్కిరిబిక్కిరి

Ukraine Russia: Gas Key in Ukraine Conflict and Global Supply be Hit - Sakshi

రష్యా గ్యాస్‌పై ఆధారపడ్డ ఖండం

నేషనల్‌ డెస్క్, సాక్షి: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి యూరప్‌ దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. యూరప్‌ సహజ వాయువు (గ్యాస్‌) అవసరాల్లో ఏకంగా 40 శాతం దాకా రష్యానే తీరుస్తోంది. జర్మనీకైతే 65 శాతం గ్యాస్‌ రష్యా నుంచే వస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌ వంటి చిన్న దేశాలైతే పూర్తిగా రష్యా గ్యాస్‌ మీదే ఆధారపడ్డాయి. 

ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా రష్యా నుంచి సరఫరా ఆగిపోయి యూరప్‌ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. పైగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది. 1,100 కోట్ల డాలర్లతో తలపెట్టిన ఈ 1,222 కిలోమీటర్ల లైన్‌ రష్యా నుంచి బాల్టిక్‌ సముద్రం గుండా ఫిన్లాండ్, స్వీడన్, పోలాండ్‌ మీదుగా జర్మనీ వెళ్తుంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నందుకు 2021లో యూరప్‌ దేశాలకు అదనపు గ్యాస్‌ సరఫరాలను రష్యా ఆపేసినందుకే విలవిల్లాడాయి. గ్యాస్‌ ధరలు ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగి ఆర్థికంగా కూడా దెబ్బ తిన్నాయి. ఈ భయంతోనే ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగకుండా రష్యాను ఏదోలా అనునయించేందుకు యూరప్‌ దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ చివరిదాకా శతవిధాలా ప్రయత్నించాయి.

చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?)

ముఖ్యంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కాలికి బలపం కట్టుకుని మరీ అమెరికా, రష్యా మధ్య తిరిగారు. తాజాగా కూడా బైడెన్, పుతిన్‌ చర్చలకు ఆయన రంగం సిద్ధం చేశారు. యుద్ధ నేపథ్యంలో అమెరికా నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకోవాలనుకున్నా అది ఆర్థికంగా పెను భారమే అవుతుంది. ఏడాదిన్నర క్రితంతో పోలిస్తే యూరప్‌ దేశాలు ఇప్పటికే గ్యాస్‌ కొనుగోళ్లపై ఎనిమిది రెట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. యూఎస్‌పై ఆధారపడాల్సి వస్తే ఇది ఏకంగా మరో రెండింతలు కావచ్చని అంచనా. అంతంత మొత్తాలు వెచ్చించేందుకు ఒకవేళ సిద్ధపడ్డా లాభం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడానికే అమెరికా ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం మరికొద్ది నెలల పాటు యూరప్‌కు గ్యాస్‌ సరఫరా చేసే పరిస్థితి లేనే లేదని చెబుతున్నారు.  

చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్‌–రష్యా బంధం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top