Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?

Russia Vs Ukraine: Why is Vladimir Putin Attacking Ukraine? - Sakshi

అగ్రరాజ్యం అమెరికా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా, దీటుగా ప్రతిదాడి ఉంటుందని నాటో స్పష్టం చేసినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్‌పై పంజా విసిరారు. సైనిక చర్యకు దిగారు. పాశ్చాత్యదేశాల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా.. పెడచెవిన పెడుతూ తాను అనుకున్నది చేసేసే మొండి ధైర్యం, పట్టుదల... రష్యా అధ్యక్షుడికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఆయన లెక్కలు, సమీకరణాలు ఎలా ఉన్నాయి. ఎవరి అండ ఉందనే భరోసాతో పుతిన్‌ ఈ సాహసానికి ఒడిగట్టారో చూద్దాం.. 

‘రిస్క్‌’తో కూడిన నిర్ణయం 
తూర్పు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న సాధారణ పౌరులు, రష్యన్లను రక్షించడానికి సైనిక చర్య తప్పలేదని పుతిన్‌ దాడికి దిగేముందు పేర్కొన్నారు. ఎవరైనా ఈ యుద్ధంలో జోక్యం చేసుకంటే ఇదివరకెన్నడూ చూడనంతటి తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా, బ్రిటన్‌లు బ్యాంకుల లావాదేవీలపై నిషేధం విధించడం, రష్యా చమురు దిగ్గజాలుగా పేరొందిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం తదితర ఆర్థికపరమైన ఆంక్షలకు దిగాయి.  

ఆర్థిక నిల్వలు వేగంగా ఆవిరి 
నాలుగైదు నెలలుగా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉండటం ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూసింది. రాజధాని కీవ్‌లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ పోయాయి. కొద్ది వారాల వ్యవధిలో వందలాది మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లాయి. ఆర్థిక వ్యవస్థను అష్టదిగ్బంధన చేయడం ఉక్రెయిన్‌ను దారికి తేవాలనేది క్రెమ్లిన్‌ ఎత్తుగడ. దీన్నే ఉక్రెయిన్‌ ‘హైబ్రిడ్‌ యుద్ధ తంత్రం’గా అభివర్ణించింది. చెదలు పట్టినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుంచి తినేయడమే పుతిన్‌ లక్ష్యమని విమర్శించింది.  

చదవండి: (Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?)


పుతిన్‌ ముఖ్యంగా మూడు అంశాలను బలంగా నమ్ముకున్నారు. అవి.. 
1. శరవేగంగా పతనమవుతున్న ఉక్రెయిన్‌ ఆర్థిక పరిస్థితి.  
2. రష్యా వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తి. 
3. చైనా అండగా నిలవడం. 
ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఉక్రెయిన్‌ మీదుగా వెళుతున్న చమురు నౌకలను (ఎగుమతులను) నిలిపివేయడం, పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరాను ఆపేయడంతో ట్రాన్సిట్‌ చార్జీలుగా వసూలయ్యే వందలాది బిలియన్ల డాలర్లు రాలేదు. ఫలితంగా గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉక్రెయిన్‌ కరెన్సీ విలువపడిపోయింది. ఒకవైపు యుద్ధానికి కాలుదువ్వుతూనే.. మరోవైపు ఉక్రెయిన్‌ ఆర్థికరంగాన్ని పిండివేసే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్‌ గ్యాస్‌ సరఫరా కూడా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఉక్రెయిన్‌కు అండగా నిలబడి ప్రత్యక్ష యుద్ధాన్ని అమెరికా లేదా నాటో దేశాలు కోరుకోవనే గట్టి నమ్మకంతో పుతిన్‌ పావులు కదుపుతున్నారు.

చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్‌ ఎందుకు తటస్థం?)
 
సమృద్ధిగా విదేశీ మారకద్రవ్య నిలువలు 
సాధారణంగా ఆర్థిక ఆంక్షలు పెడితే.. ఆయా దేశాల్లోకి వచ్చే డాలర్లు, ఇతర విదేశీ మారకద్రవ్యం నిలిచిపోతుంది. రిజర్వు నిధుల్లోనుంచి వాడి తాత్కాలికంగా నెట్టుకొచ్చినా.. దీర్ఘకాలంగా ఆంక్షల చట్రంలో ఉంటే దిగుమతులకు డబ్బులు చెల్లించలేక అవస్థపడాల్సి వస్తుంది. రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు గత ఏడాది డిసెంబర్‌ నాటికి రికార్డు స్థాయిలో 6.3 లక్షల మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. కాబట్టి ఆర్థికంగా దిగ్బంధించినా రష్యాకు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. మరోవైపు రష్యా– చైనాల మధ్య ఇటీవలి కాలంలో మరింత సన్నిహితమవుతున్నాయి. ప్రపంచ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, యూఎస్, యూకేల మధ్య ఇటీవల ఆకస్‌ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ప్రాంతీయంగా బలాలను సరిచేయాలనే ఉద్దేశంతో చైనా.. రష్యాకు దగ్గరవుతోంది. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top