ఉక్రెయిన్ డ్రోన్ దాడి: రష్యా బస్సు ధ్వంసం.. ఏడుగురు మృతి! | Ukraine Drone Strike Hits Civilian Bus, 7 Killed in Escalation | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ డ్రోన్ దాడి: రష్యా బస్సు ధ్వంసం.. ఏడుగురు మృతి!

Jun 3 2026 1:22 PM | Updated on Jun 3 2026 1:26 PM

Ukraine Drone Strike Hits Civilian Bus, 7 Killed in Escalation

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్  మధ్య యుద్ధం మరోసారి భీకర రూపం దాల్చింది. ఉక్రెయిన్ దళాలు జరిపిన  డ్రోన్ దాడిలో రష్యా ఆధీనంలోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక సివిలియన్ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్ మౌలిక వసతులే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసిన మరుసటి రోజే ఈ ప్రతీకార దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

బస్సు సరిహద్దుల్లోకి రాగానే..
మాస్కో నుండి క్రిమియా ద్వీపకల్పంలోని సింఫెరోపోల్‌కు బయలుదేరిన ఒక ప్యాసింజర్ బస్సు డొనెట్స్క్ సరిహద్దుల్లోకి రాగానే ఉక్రెయిన్ డ్రోన్ దాడికి గురైంది. ఈ దాడి తీవ్రతకు బస్సు పూర్తిగా తునాతునకలయ్యింది. డొనెట్స్క్ ప్రాంత రష్యా గవర్నర్ డెనిస్ పుషిలిన్ టెలిగ్రామ్ వేదికగా స్పందిస్తూ, ఎనకీవ్ సమీపంలో జరిగిన ఈ యూఏవీ దాడిలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన 11 మందికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ముంచెత్తిన 354 డ్రోన్లు
మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దులు దాటి వచ్చిన ఉక్రెయిన్ వైమానిక దళం ఒకే రాత్రిలో రష్యాపైకి భారీగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాలైన బెల్గోరోడ్, కుర్స్క్, మాస్కో పరిసర ప్రాంతాలు, అజోవ్ సముద్ర తీరంలో మొత్తం 354 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా పేర్కొంది. ఇరు దేశాల మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయిలో పరస్పర వైమానిక దాడులు జరగడం ఇదే మొదటిసారి.

రష్యాలోనూ ఎదురుదెబ్బ
ఈ సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 86 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక సైనిక యంత్రాంగం తెలిపింది. అంతకుముందు రోజు రష్యా ఏకంగా 73 క్షిపణులు, 656 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్, ద్నిప్రో నగరాలపై భారీ దాడికి పాల్పడింది. ఈ దాడి ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను తాత్కాలికంగా నిర్వీర్యం చేయడమే కాకుండా, ఉక్రెయిన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేయడానికి కారణంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement