పుతిన్‌ను విచారించడానికి ప్రత్యేక క్రిమినల్‌ ట్రిబ్యునల్‌ | Sakshi
Sakshi News home page

పుతిన్‌ను విచారించడానికి ప్రత్యేక క్రిమినల్‌ ట్రిబ్యునల్‌

Published Sat, Mar 5 2022 8:03 AM

Ukraine Demands Criminal Tribunal Committee For Putin - Sakshi

లండన్‌: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన అనుచరులపై విచారణ జరపడానికి ప్రత్యేక క్రిమినల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వం, బ్రిటిష్‌ మాజీ ప్రధాని గోర్డన్‌ బ్రౌన్‌ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సీనియర్‌ నాజీలను విచారించి, శిక్షించడానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసినట్లు బ్రౌన్‌ గుర్తుచేశారు.

అదే తరహాలో పుతిన్‌పై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. న్యాయ విచారణ నుంచి పుతిన్‌ తప్పించుకోవడానికి వీల్లేదని గోర్డన్‌ బ్రౌన్‌ అన్నారు. అతడి అరాచకాలపై విచారణ జరిపి, తగిన శిక్ష విధించాల్సిందేనని చెప్పారు. ఈ ఆలోచనను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా స్వాగతించారు. 

ఉక్రెయిన్‌లో హక్కుల ఉల్లంఘనపై  స్వతంత్ర కమిటీ
జెనీవా/ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడితో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, హక్కుల నేరాలకు సంబంధించి స్వతంత్రంగా వ్యవహరించే అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రతిపాదించింది. రష్యా ఆగ్రహావేశాలకు నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితికి సంబంధించి ముసాయిదా తీర్మానాన్ని  శుక్రవారం యూఎన్‌ మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టారు.  

దీనిపై జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 42 మంది సభ్య దేశాలున్న మండలిలో  తీర్మానానికి అనుకూలంగా అమెరికా , యూకే సహా  32 దేశాలు ఓట్లు వేస్తే, వ్యతిరేకంగా రెండు ఓట్లు (రష్యా, ఎరిట్రియా) వచ్చాయి.  భారత్, చైనా, పాకిస్తాన్, సూడాన్, వెనిజులా సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రష్యా దురహంకార  పూరిత వైఖరిని ఆ తీర్మానం తీవ్రంగా ఖండించింది. అత్యవసరంగా అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలంది.

Advertisement
Advertisement