UAE President Death: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కన్నుమూత!

UAE President Sheikh Khalifa bin Zayed passes away - Sakshi

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇక లేరు. 73 ఏళ్ల షేక్‌ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.  

షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 

1948లో పుట్టిన షేక్‌ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే చాలాకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో అదే కారణమని తెలుస్తోంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడు రోజులపాటు పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలు పూర్తిగా బంద్‌ పాటించనున్నాయి.

గతంలో స్ట్రోక్‌బారిన పడిన ఆయన.. 2014 నుండి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగింది. అయినప్పటికీ ఆయన తీర్పులు, కీలక చట్టాలు చేయడం కొనసాగించారు.ఆయన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు. షేక్‌ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top