అధ్యక్షుడు జోసెఫ్‌కు ట్రంప్ హామీ
వాషింగ్టన్: లెబనాన్‌కు తాము అవసరమైన మేర సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జోసెఫ్‌తో సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ అనుకూల హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూపునకు మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్‌లో శాంతి నెలకొంది. ఇవే పరిస్థితులను కొనసాగేలా చూడాలని, ఇజ్రాయెల్ బలగాలు ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి తమ మిలటరీకి అప్పగించాలని జోసెఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
‘లెబనాన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేశం. తగిన గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. ఆ దేశానికి ఎంతగానో సాయం అందజేబోతున్నాం’అని తెలిపారు. ‘లెబనాన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నాం. అయితే, ఇరాన్‌తో యుద్ధం తీవ్రతరం కావడంతో మా దృష్టంతా అటువైపు ఉంది. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించింది. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నాయకుడితో చర్చలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు’అని ట్రంప్ అన్నారు. కాగా, 2009 తర్వాత లెబనాన్ అధ్యక్షుడు వైట్ హౌస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి.


