
గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి’’ అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.
హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్.. ఇజ్రాయెల్- హమాస్ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్ వెళ్తునట్లు తెలిపారాయన.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.
ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది.