ట్రంప్ ఉద్దేశం నిజంగా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీయడమేనా?. అందుకే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించారా?.. ఇక మీదట ఏ దేశం కూడా ఇరాన్ వైపు చూడకూడదనేదే ఆయన ఆలోచనా?. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే కాదేమో అనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన కనిపిస్తోంది ఆయన వ్యవహారం.
‘‘మోదీ-ట్రంప్‌ది నిజమైన స్నేహం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారత్-అమెరికా రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం అనేది చాలా కీలకం. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇక సుంకాలనేవి పెద్ద విషయమే కాదు. మాకు భారత్ తర్వాతే ఎవరైనా’.. ఇది భారత్‌కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో..
ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం.. ఏదైనా సరే అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ నిర్ణయాలు భారత్ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్ యద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకున పెడుతున్నామని చెబుతూ.. భారత్‌పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్‌తో వాణిజ్యం జరిపే టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే.. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల పెంపు నిర్ణయం భారత్‌కు వర్తించనుంది. దీంతో ట్రంప్ అసలు టార్గెట్(రష్యా, ఇరాన్..)తో పాటు భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
స్నేహ హస్తం చాస్తూనే..
రెండో దఫా అధికారంలోకి వచ్చాక భారత్‌తో ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్ అమెరికాకు బాగా కావాల్సిన దేశమని.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారాయన. అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం లేదు. కీలక సదస్సులకు కూడా ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహ బంధానికి బీటల వారిందా? అనే చర్చా నడిచింది. అయితే.. ‘‘నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి..’’ అంటూ ఓ వారం కిందట కూడా ట్రంప్ మాట్లాడారు.
ఇంకా అయిపోలేదు..
అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ కరెక్ట్‌గా లేదంటూ ప్రతీకార సుంకంగా 25 శాతం.. అటుపై వద్దని చెబుతున్నా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతున్నారంటూ పెనాల్టీ పేరు చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలను ఆయన తన మిత్రదేశం పైనే విధించినట్లైంది. అందునా.. ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుండానే(నాన్చుతూ వస్తున్నారు) ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతలతో దానిని 75 శాతానికి పెంచారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.
రష్యాతో చమురు వాణిజ్యం జరిపే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించే బిల్లుపై ఆయన ఇప్పటికే సంతకాలు చేశారు. ఆ బిల్లును రేపోమాపో అమెరికా చట్ట సభలో ముందుకు కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు అమెరికాతో భారత్ సంబంధాలు బలహీన పడ్డాయి. ఆయన తీరు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరింత అధ్వాన్నం కావొచ్చనే అమెరికా మాజీ విదేశాంగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇరాన్-భారత్.. ఎలాంటి ఎఫెక్ట్
రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం వైఖరి మొండిగానే కనిపిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని.. జాతి ప్రయోజనాలకు తగ్గట్లు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా.. దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇరాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించబోతుంది..
ఇరాన్ నుంచి భారత్ మెథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరాలు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఇరాన్‌కు.. ఆర్గానిక్ కెమికల్స్, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్-భారత్ మధ్య 2024-2025 వాణిజ్యం విలువ.. అక్షరాల రూ.14,000 కోట్లు. అందులో భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.10,000 కోట్లు కాగా, దిగుమతులు రూ.3,700 కోట్ల పైమాటే. అయితే.. ట్రంప్ 2018లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. ఎంతగా అంటే.. 2019లో ఆ వాణిజ్యం విలువ రూ.1.5 లక్ష కోట్లుగా ఉండేది. మరి తాజా ఆంక్షలతో ఏం జరుగుతోందో చూడాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కొత్త టారిఫ్‌లు కఠినంగా అమలు చేస్తే.. భారత కంపెనీలు అమెరికా మార్కెట్ యాక్సెస్ కాపాడుకోవడానికి ఇరాన్‌తో వ్యాపారాన్ని తగ్గించవలసి రావొచ్చు. అదే జరిగితే.. ఇరాన్‌కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.
చాబహార్‌పై డైలమా?
భారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ పాత్ర అత్యంత వ్యూహాత్మకం. పైగా భారత్ అక్కడ షహీద్ బెహేష్తీ టెర్మినల్ అభివృద్ధి చేస్తోంది. అయితే.. 2018 ఆంక్షల సమయంలో భారత్ విజ్ఞప్తి మేరకు ట్రంప్ సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చారు. తిరిగి.. 2025 సెప్టెంబర్‌లో పరిస్థితుల ప్రభావమని చెబుతూ ఆ మినహాయింపును రద్దు చేశారు. దీంతో ఆ మినహాయింపు ఏప్రిల్ 29తో ముగియనుంది. దీంతో మినహాయింపు గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.
ఏమై ఉండొచ్చు..
తనను తాను శాంతి కాముకుడిగా చెప్పుకుని తిరుగుతున్న ట్రంప్.. పెద్దన్న హోదాలో వరుసగా యుద్ధాలను ఆపుతున్నానంటూ హడావిడి చేస్తున్నారు. ఈ వంకతో నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని పక్కా ప్లాన్డ్‌తో ముందుకు సాగారు. కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ట్రంప్‌ను నోబెల్ వరించలేదు. దానికి భారత్ మోకాలు అడ్డుపెట్టిందని ఆయన బలంగా భావించి ఉండొచ్చు. పాక్‌తో ఉద్రిక్తతలు చల్లారడంలో ట్రంప్ ప్రేమయం(మూడో వ్యక్తి) లేదని ఢిల్లీ వర్గాలు తేల్చేశాయి. ఈ ప్రకటన ఆయనకు స్వతహాగా కోపం.. అసహనం తెప్పించి ఉండొచ్చు. పోనీ ఉక్రెయిన్ యుద్ధంతోనైనా నోబెల కల నెరవేరిందా? అంటే అదీ లేదు. వాణిజ్యం ఆపేయకుండా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ పరోక్షంగా సహకరించిందనే కోపమూ ఉండొచ్చు. వీటన్నింటితో పాటు షాంగై సదస్సు వేదికగా.. పుతిన్-జింగ్‌పిన్-మోదీల స్నేహంగా మెదలడమూ ట్రంప్‌కు నచ్చకపోయి ఉండొచ్చు. కారణాలేవైనా.. భారత్ విషయంలో ఆయన అనుకున్నది చేస్తూ పోతున్నారు.


