అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో బుధవారం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఆయన అన్నారు.
ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో తన ప్రసంగం ముగిసిన తర్వాత భారత్‌కు చెందిన 'మనీకంట్రోల్' వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. "మీ ప్రధానమంత్రిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు మంచి మిత్రుడు. త్వరలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము" అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా భారత్-యూఎస్ బీటీఎ ఒప్పందం మొదట దశకు చాలా దగ్గరగా ఉందని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ గురుంచి ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191(సుమారు ₹15.8 లక్షల కోట్లు) బిలియన్లుగా ఉంది. అయితే ఈ కొత్త డీల్ ద్వారా 2030 నాటికి దీనిని $500 బిలియన్లకు (సుమారు ₹41 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌కు ప్రస్తుతం అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది.
భారత్ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం వాటా అమెరికాదే. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీంతో భారత ఎగుమతులు సుమారు 8.5 శాతం తగ్గాయి. అయితే దావోస్ సదస్సులో భారత్‌పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈ సుంకాలు తగ్గే అవకాశముంది.


