అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై కొనసాగుతున్న సందిగ్ధత
నేడు ఇస్లామాబాద్‌లో మొదలుకావాల్సిన శాంతి చర్చలు
అమెరికా సిద్ధపడినా మొండికేస్తున్న ఇరాన్
ఒప్పందం కుదరకపోతే బాంబులేస్తామన్న ట్రంప్
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.
కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.
రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది
మేమింకా వేచిచూస్తున్నాం
ఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు.
అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు
చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.
మరో నౌక స్వాదీనం: అమెరికా
ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్‌కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది.
దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్
ఇరాన్‌కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్‌ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్‌నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.
ఆ 8 మందిని విడిచిపెట్టండి
ఇరాన్‌కు ట్రంప్ పిలుపు
వాషింగ్టన్: ఇరాన్‌లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్‌లో అమె రికా–ఇరాన్‌ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు.


