‘అతని మాట వింటే 5 లక్షల మరణాలుండేవి’

Trump Alleges We Have 500000 Deaths If I Listened To Anthony Fauci - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సమయంలో ఎలా మాట్లాడతారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఊహించడం కష్టం. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కరోనా వైరస్ ఎక్స్‌పర్ట్‌ ఆంథోనీ ఫౌసీ మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆయన ఓ పెద్ద విపత్తు అని.. కోవిడ్‌ విషయంలో ఫౌసీ మాటలు విని ఉంటే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు చేరేదని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి ఫౌసీ, ట్రంప్‌తో విభేదిస్తూనే ఉన్నారు. ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అమెరికాలో 2 లక్షల పై చిలుకు మరణాలు సంబంవించినట్లు ఫౌసీ ఆరోపించారు. ఇది రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. దాంతో ట్రంప్‌ ఫౌసీ మీద గుర్రుగా ఉన్నారు. (చదవండి: భారత్‌పై ట్రంప్‌ విమర్శలు)

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ ‘ఫౌసీ ఒక విపత్తు. ఒక వేళ నేను అతని మాట విన్నట్లైతే.. అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్‌ మరణాలు సంభవించేవి. ప్రస్తుతం మహమ్మారి అదుపులోనే ఉంది. జనాలు కూడా మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టండి అంటున్నారు. ఫౌసీ లాంటి మూర్ఖుల మాటలు విని విని వారు అలసి పోయారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులను అనుమతించారు. ఇక రిపబ్లికన్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ల క్రింద పనిచేయడమే కాక అమెరికాలో అత్యంత ఆరాధించబడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఫౌసీ, 79, కోవిడ్‌ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కానీ ట్రంప్‌ ఆయన మాటలను పట్టించుకోలేదు. చివరకు స్వయంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. (చదవండి: ఓడిపోతే.. దేశం విడిచి వెళతానేమో!)

పుంజుకుంటాం..
ఇక అధ్యక్ష ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే పలు సర్వేల ప్రకారం‌ ప్రత్యర్థి జో బైడెన్ ట్రంప్‌ కన్నా ముందంజలో ఉన్నాడని వెల్లడిస్తున్నాయి. అయితే వీటిని ట్రంప్‌ కొట్టి పారేస్తున్నారు. ఇవన్ని చెత్త. సరైన సమాయానికి మేము పుంజుకుంటాము.. ప్రజల మద్దతును సంపాదిస్తాము’ అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top