
బ్యాంకాక్: థాయ్‌లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్‌లాండ్ పరిధిలోని సురిన్ ప్రావిన్స్‌లో ప్రసాత్ తా ముయెన్ ఉంది. అయితే కంబోడియా ఇది తమదేనని చెబుతోంది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. గురువారం ఉదయం పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తుండటంతో, తాము పారిపోయి కాంక్రీట్ బంకర్‌లో దాక్కుంటున్నట్లు థాయ్‌లాండ్ ప్రజలు తెలిపారు. థాయ్‌లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.
థాయ్‌లాండ్ ముందుగా ఈ సాయుధ ఘర్షణను ప్రారంభించిందని, కంబోడియా స్వయం రక్షణ పరిధిలోనే వ్యవహరించిందని, అయితే థాయ్ దళాల నిర్ద్వంద్వ చొరబాటుకు ప్రతిస్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.