Afghanistan: తాలిబన్లకు పెరుగుతున్న మద్దతు!

Talibans Are Getting Support From Developed Countries In Afghanistan - Sakshi

అఫ్గానిస్తాన్‌లోని నాయకులు బతుకు జీవుడా అంటూ విదేశాలకు పారిపోతున్నారు. అక్కడి సామాన్య ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటుతున్నారు. ఎక్కడ చూసినా కల్లోలమే.. ఏ దేవుడైనా కాపాడకపోతాడా అని ఎదురు చూపులే. ఇది తాలిబన్ల రాకతో అఫ్గాన్‌లోని పరిస్థితులు. ఈ క్రమంలో తాలిబన్లకు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది.

చదవండి: కశ్మీర్‌ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్‌

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్‌లకు తొలిసారిగా చైనా మద్దతు ప్రకటించింది. ‘‘తాలిబన్ల పాలనను స్వాగతిస్తున్నాం. అఫ్గాన్‌ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించునే హక్కును చైనా గౌరవిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో స్నేహపూర్వక, సహకారం సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. తాలిబన్లు కూడా చైనాతో సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నారు. అఫ్గాన్‌ పునర్నిర్మాణం, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం కోసం తాలిబన్లు ఎదురు చూస్తున్నారు’’ అని ఇటీవల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్‌ తెలిపారు.

 రష్యా


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నాగరికతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రపంచ సమాజం కాబుల్‌తో మంచి దౌత్య సంబంధాలను కొనసాగించే విధంగా తాలిబన్లు ప్రవర్తించడాన్ని చూడాలనుకుంటున్నానని పుతిన్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌ విచ్ఛిన్నంపై రష్యాకు ఆసక్తి లేదని, ఒకవేళ అదే జరిగితే.. మాట్లాడటానికి ఎవరూ ఉండరని పుతిన్ అన్నారు.

అంతే కాకుండా అమెరికన్లు చాలా ఆచరణాత్మక వ్యక్తులు అనే ప్రచారానికి కొన్ని సంవత్సరాలుగా 1.5 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేశారని, కానీ ఫలితం ఏంటి? సున్నా అని తెలిపారు. ఇక 1989 సోవియట్ దళాల ఉపసంహరణతో అఫ్గాన్‌లో 10 సంవత్సరాల సుదీర్ఘ యుఎస్‌ఎస్‌ఆర్ యుద్ధం నుంచి పుతిన్ ఓ పాఠాన్ని నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్‌కు సంబంధించి రష్యా తన దౌత్య ప్రయత్నాలన్నింటినీ చేసింది. ఇప్పటికీ తాలిబన్ గ్రూప్‌ను మాస్కోలో 'తీవ్రవాద సంస్థ'గా ముద్ర ఉంది.

పాకిస్తాన్‌
అఫ్గానిస్తాన్ పతనం తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్‌ను సందర్శించారు. ఆయన వెంట పాక్‌ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్‌ అఫ్గాన్‌ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్‌ అబ్జర్వర్‌ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్‌ఐ చీఫ్‌ను ఆహ్వానించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి.

అమెరికా
తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనార్టీల హక్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. ముఖ్యమైన విషయాలు, సమస్యలపై తాలిబన్ల సారథ్యంలోని కొత్త అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చిస్తామని బ్లింకెన్‌ హామీ ఇచ్చారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది.

'మానవతా సంక్షోభం'
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తాలిబన్ల పట్ల తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులచే హింసకు గురవుతోన్న స్థానికులను కాపాడటం గురించి ఆందోళన చెందుతోంది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలు తాలిబన్లతో సంబంధాలకు తెల్ల జెండాలను రెపరెపలాడిస్తున్నాయి. కానీ అఫ్గాన్‌లో జరిగే సంఘటనల గురించి ప్రపంచం బాధాతప్త హృదయంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ‘‘ఒక్కటిగా’’ నిలువాలి" అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియా గుటెరస్‌ అన్నారు.

చదవండి: పోలీస్‌ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top