తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత

Taliban Killed 13 to Silence Music At A Wedding Party in Nangarhar - Sakshi

అఫ్గనిస్తాన్‌లో దారుణం

సామాన్యులను ఊచ కోత కోసిన తాలిబన్లు

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఓవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. దేశంలో మాంద్యం పెరిగితోంది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. చాంధస పాలన కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన గురించి చదివాం. తాజాగా తాలిబన్లు​ మరో దుశ్చర్యకు పూనుకున్నారు. పెళిల్లో మ్యూజిక్‌ బంద్‌ చేయించడం కోసం ఏకంగా 13 మందిని చంపేశారు. 

ఈ విషయాన్ని అఫ్గన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేహ్‌ శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమ్రుల్లా చెప్పిన దాని ప్రకారం నంగర్‌హార్ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఓ చోట వివాహం జరుగుతుంది. ఇక పెళ్లి అంటే సందడి ఉంటుంది కదా. అలానే ఆ వివాహ వేడుక వద్ద మ్యూజిక్‌ ఏర్పాటు చేశారు. అది తాలిబన్లకు నచ్చలేదు. మ్యూజిక్‌ ఆపమని చెప్పడానికి వారు అక్కడున్న జనాల్లో ఓ 13 మందిని ఊచకోత కోశారు. 
(చదవండి: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం )

ఈ సందర్భంగా అమ్రుల్లా ‘‘తాలిబన్‌ మిలిటెంట్లు నంగర్‌హార్ ప్రావిన్స్‌ ప్రాంతంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో సంగీతాన్ని ఆపడం కోసం 13 మందిని ఊచకోత కోశారు. మనం కేవలం ఖండించడం ద్వారా మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేం. మన సంస్కృతిని చంపేయడం కోసం పాకిస్తాన్‌ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. మన సంస్కృతి స్థానంలో ఐఎస్‌ఐ కల్చర్‌ని తీసుకువచ్చి.. మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదు. కానీ ఉన్నన్ని రోజులు అఫ్గన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: అఫ్గాన్‌ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?)

అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్‌, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించకూడదంటూ నిషేధం విధించారు. అఫ్గనిస్తాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ కాలేజీని కూడా మూసేశారు. 

చదవండి: ఆ డబ్బులు అఫ్గనిస్తాన్‌వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top