
మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్‌కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఓపెన్ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
అఫ్గన్ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.
ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్‌ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..
అఫ్గనిస్తాన్‌ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్‌కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.
ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్‌టైజ్‌మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు.
The Taliban has released a tourism appeal video aimed at attracting American visitors
Their message to Americans:
"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"
Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025
‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు.
ఇంతకీ అఫ్గన్ నేలపై ఏమున్నాయి..
కాబూల్ (Kabul) అఫ్గన్ రాజధాని నగరం. గార్డెన్స్ ఆఫ్ బాబర్, దారుల్ అమల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి.

దారుల్ అమల్ ప్యాలెస్
హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్ సిటాడెల్ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.

మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.
బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.

కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.
జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.
ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.
బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్‌లో మొట్టమొదటి నేషనల్ పార్క్.
పంజ్‌షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.

బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.
బిజినెస్ ఇన్‌సైడర్ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్ ఈస్ట్‌కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు.