Afghanistan: అఫ్గాన్‌ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?

Developments in Afghanistan Will Have Significant Consequences - Sakshi

విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ 

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది యూఎస్‌కు తాలిబన్లకు మధ్య దోహాలో జరిగిన డీల్‌లోని పలు అంశాల్లో భారత్‌ను పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్‌ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి ఇండియాకు కావాల్సిన అంశాలన్నారు. ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్‌ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. అఫ్గాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో ఇండియాకు ఎలాంటి తొందర లేదన్నారు.

యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌తో ఏర్పాటైన క్వాడ్‌ గ్రూప్‌  ఏదేశానికి వ్యతిరేకం కాదని, దురుద్దేశాలతో ఏర్పాటైన కూటమి కాదని స్పష్టం చేశారు. అఫ్గాన్‌ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో ఇండియా, అమెరికాకు సామ్యాలున్నాయని చెప్పారు. అయితే దోహా డీల్‌ సందర్భంగా తమను అనేక అంశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఎత్తిపొడిచారు. అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని పరోక్షంగా అమెరికాను దెప్పిపొడిచారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ప్రశ్నించారు.  

అంత రహస్యమెందుకు? 
దోహాలో యూఎస్, తాలిబన్లకు మధ్య అఫ్గాన్‌పై ఒప్పందం కుదరింది. దీని ప్రకారం యూఎస్‌ దళాలు అఫ్గాన్‌ నుంచి వైదొలుగుతాయి, తాలిబన్లు హింసను వీడతారు. కానీ పాలన చేతికొచ్చాక తాలిబన్ల ప్రవర్తన ప్రశ్నార్ధకంగా మారింది. దీన్నే జైశంకర్‌ ప్రస్తావించారు. కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని, కానీ సదరు డీల్‌లో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని చెప్పారు. అఫ్గాన్‌లో ఉగ్ర తండాలకు అభయం చిక్కకూడదన్న అంశాన్ని జోబైడెన్‌తో ప్రధాని ప్రస్తావించారని తెలిపారు.

అఫ్గాన్‌లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. పాక్‌కు సంయుక్త వార్నింగ్‌ ఇవ్వడంపై అమెరికానే తేల్చుకోవాలన్నారు. క్వాడ్‌ను నెగిటివ్‌ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top