పాక్‌ ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి

Published Wed, Dec 13 2023 4:24 AM

Suicide attack on Pakistan army base kills 23 soldiers - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్‌ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దారాబన్‌ ఏరియాలోని ఆర్మీ కార్యాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆర్మీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో వేగంగా వచ్చి గేటును ఢీకొట్టారు.

అనంతరం మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రెండు దాడుల్లో ఆర్మీ కార్యాలయ భవనం కుప్పకూలింది. అనంతరం ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

ఈ ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతంటూ తెహ్రీక్‌–ఇ– తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ)అనుబంధంగా కొత్తగా ఏర్పడ్డ తెహ్రీక్‌–ఇ–జిహాద్‌ పాకిస్తాన్‌(టీజేపీ)ప్రకటించుకుంది. ఇలా ఉండగా, ఇదే జిల్లాలోని దారాజిందా, కులాచి ప్రాంతాల్లో సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ తెలిపింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement