ట్రంప్ క్షమాపణ చెప్పాలన్న స్టార్మర్
లండన్: అఫ్గానిస్తాన్‌లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందుండగా నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపో యాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందాను. ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి’అని స్టార్మర్ పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్‌లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయని, దేశం కోసం త్యాగాలు చేశాయని స్టార్మర్ కొనియాడారు. నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ట్రంప్‌ను ఆయన కోరారు. అవసరమైనప్పుడు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో సిద్ధంగా ఉంటుందన్న తనకు నమ్మకం లేదని ట్రంప్ దావోస్‌లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మాకు నాటో అవసరం ఎప్పుడూ రాలేదు, మేం వారిని నిజానికి ఏమీ అడగలేదు. నాటో దేశాల వారు అఫ్గానిస్తాన్‌కు, ఇతర ప్రాంతాలకు కొన్ని దళాలను పంపించారు. కానీ, వారు ముందు వరుసలో ఉండటానికి బదులు వెనుకనే ఉండిపోయారు’అని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది.


