అధ్యక్షుడి భవనంలో కరెన‍్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు

Sri Lankan Crisis protesters find millions of rupees from Gotabaya Rajapaksa house - Sakshi

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పులు వచ్చినా ఎలాంటి పురోగతి కనిపించకపోవటంతో మళ్లీ పెద్ద ఎత్తున  లంకేయులు ఆందోళనలకు దిగారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం లక్షల మంది ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించారు. భద్రతావలయాన్ని దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే గొటబాయ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలో ప్రవేశించిన నిరసన కారులు రచ్చ రచ్చ చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టడం, గొటబాయ పడగది, వంటగదిలోని వీడియోలు బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదును నిరసనకారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీలంక దినపత్రిక డైలీ మిర్రర్‌ ప్రకారం.. అధ్యక్ష భవనంలో దొరికిన సొమ్మును అక్కడి భద‍్రతా విభాగానికి అందించారు. దేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కోట్లాది రూపాయలు అధ్యక్షుడి భవనంలో లభించటంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నగదుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర‍్లు కొట‍్టింది. అందులో ఓ నిరసనకారుడు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నట్లు కనిపించాడు. ఆ నోట్ల కట్టలను అధ్యక్షుడి అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు నిరసనకారులు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాకే నిజానిజాలు తెలుస్తాయని, సరైన ఆధారాలతో సమాచారం అందిస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. 

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా..
దేశంలో పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్‌ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కరలు ప్రకటించారు. మరోవైపు.. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు, సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరారు త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ శవేంద్ర సిల్వా. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న క్రమంలో త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఈ ప్రకటన చేశారు సీడీఎస్‌. 

ఇదీ చదవండి: కొనడానికి లేదు.. తినడానికి లేదు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top