
సోవియట్ హయాంలో ప్రయోగించిన అంతరిక్ష నౌక
కేప్ కనవెరాల్(యూఎస్‌ఏ): సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ భూమిపైకి దూసుకొస్తోంది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన ‘కాస్మోస్ 482’విఫలమైంది. అర్ధ శతాబ్దానికి పైగా వివిధ కక్ష్యల్లో తిరుగుతున్న ఈ అంతరిక్ష నౌక తదుపరి కక్ష్యల్లో కనిపించడం లేదని జర్మనీ రాడార్ స్టేషన్ ఇటీవల గుర్తించినట్లు యూరోపియన్ యూనియన్ స్పేస్ సరై్వలెన్స్ అండ్ ట్రాకింగ్ విభాగం తెలిపింది. ఈ అనియంత్రిత కాస్మోస్ భూమిపైకి తిరిగి మళ్లిందని ఈ సంస్థ తాజాగా ధ్రువీకరించింది. 1972లో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్‌లలో ‘కాస్మోస్ 482’ప్రయోగం ఒకటి.
రాకెట్ విఫలం కావడంతో సుమారు 500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష నౌక భూ కక్ష్యలోనే ఉండిపోయింది. అనంతరం సుమారు దశాబ్దం కాలంపాటు కాస్మోస్ విడి భాగాల్లో చాలా వరకు విడిపోయి, భూమిపై పడ్డాయి. అయితే, సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే శుక్ర గ్రహం లక్ష్యంగా ప్రయోగించిన కాస్మోస్‌కు టిటానియం రేకు రక్షణగా ఉండటంతో చెక్కుచెదరలేదని నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న కాస్మోస్ కచ్చితంగా ఎక్కడ, ఎప్పుడు భూమిపై పడుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని సైంటిస్టులు, సైనిక నిపుణులు చెబుతున్నారు.