రాత్రిపూటా సౌర విద్యుత్‌!

Solar Panels That Work At Night Produce Enough Power - Sakshi

థర్మల్‌ విద్యుత్‌తో కాలుష్యం.. జల విద్యుత్‌ నిరంతరం అందుబాటులో ఉండదు.. ప్రత్యామ్నాయంగాసౌర విద్యుత్‌ ఉన్నా.. సోలార్‌ ప్యానెల్స్‌తో పగటి పూట మాత్రమే కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు చెక్‌పెట్టేలా.. పగలూరాత్రీ కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 

రెండు సాంకేతికతలను కలిపి.. 
సాధారణంగా సౌర ఫలకాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మార్చుతాయి. దీనిని ఫొటో వోల్టాయిక్‌ టెక్నాలజీ అంటారు. మరోవైపు కొన్నిరకాల పదార్థాలు తాము గ్రహించిన వేడిని తిరిగి వదిలేసే సమయంలో శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాయి. దీనిని థర్మోరేడియేటివ్‌ ప్రాసెస్‌ అంటారు. సాధారణ ఫొటో వోల్టాయిక్‌ పదార్థాలతో థర్మోరేడియేటివ్‌ మెటీరియల్‌ను కలిపి.. సోలార్‌ ప్యానెల్స్‌ను తయారు చేస్తే.. సూర్యరశ్మి తగ్గిన సమయంలో, రాత్రి పూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫోబి పియర్స్‌ తెలిపారు.  

నైట్‌ విజన్‌ గాగుల్స్‌ తరహాలో..
సైన్యం, రక్షణ విభాగాల సిబ్బంది రాత్రిపూట కూడా చూడగలిగే ఇన్‌ఫ్రారెడ్‌ (పరారుణ) నైట్‌ విజన్‌ గాగుల్స్‌ను, ఇతర పరికరాలను వినియోగిస్తుంటారు. స్వల్పస్థాయి ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌కు కూడా స్పందించే ‘మెర్క్యురీ కాడ్మియం టెల్లూరైడ్‌ (ఎంసీటీ)’ మెటీరియల్‌ వాటిలో ఉంటుంది. ఏదైనా సరే.. వేడిగా ఉన్న వస్తువు, పదార్థం నుంచి ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ వెలువ డుతూ ఉంటుంది. ఇదే తరహాలో చీకట్లో కూడా మనుషులు, జంతువులు, ఎలక్ట్రిక్, మెకానికల్‌ పరికరాల నుంచి వెలువడే ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ను నైట్‌ విజన్‌ పరికరాలతో గుర్తిస్తారు. 

►తాజాగా శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్నే ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌తో అనుసంధానించి సోలార్‌ ప్యానెల్‌ను రూపొందించారు. దీనిని ఇటీవలే ప్రయోగాత్మకంగా పరిశీలించామని.. అయితే స్వల్పస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్త ఫోబి పియర్స్‌ వెల్లడించారు. ఈ విధానంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయగలమన్నది స్పష్టమైందని.. దీనిని మెరుగుపర్చి సాధారణ వినియోగానికి తగినట్టుగా సిద్ధం చేయడం అసలు లక్ష్యమని తెలిపారు. ఈ సాంకేతికతతో కేవలం సోలార్‌ ప్యానెల్స్‌తో మాత్రమేకాకుండా.. వేడి వెలువడే ఏ చోట అయినా విద్యుత్‌ ఉత్పత్తికి వీలవుతుందని పేర్కొన్నారు. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top