విమాన భోజనంలో బయటపడిన పాము తల.. వీడియో వైరల్‌

Snake Head Found In Plane Meal Turkey Airlines Video Viral - Sakshi

Snake Head In Flight Meal, ఇస్తాంబుల్‌: భోజనం చేస్తున్న సమయంలో అందులో బల్లి బయటపడిన సంఘటనలు చాలానే చూశాం. కానీ, భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్‌లో పాము తల కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఎదురైంది. విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ సంఘటన జులై 21న జరిగినట్లు ఇండిపెండెంట్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో అందులోని సిబ్బందికి ఈ ‍అనుభవం ఎదురైనట్లు పేర్కొంది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు చెప్పాడు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్‌ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనను ఖండించారు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే తమ లక్ష్యం.’ అని పేర్కొన్నారు. 

మరోవైపు.. భోజనంలో పాము తల తమ ప్రాంతం నుంచే వచ్చిందనే వాదనలను తిరస్కరించింది కాంట్రాక్ట్‌ సంస్థ. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఒక్క వస్తువును వంటలో వేయలేదని పేర్కొంది. 280 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉడికించిన వంటలో.. తాజాగా ఉన్న పాము తల ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది? వంట వండిన తర్వాత దానిని వేసి ఉంటారని పేర్కొంది.

ఇదీ చదవండి: ‘లిక్కర్‌ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top