ఇచ్చోడ: ఏడాది క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం బయటకు తీసి తలభాగం అపహరించుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్ (19) 2024, నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు అతని మృతదేహానికి తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వెలికి తీశారు. ఆ ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని మంగళవారం గుర్తించిన మృతుడి సోదరుడు దీపక్ పోలీసులకు సమాచారం అందించాడు.
మృతదేహంలో తల భాగాన్ని వారు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గత∙ఆదివారం పుష్య అమావాస్య కావడంతో.. తల భాగాన్ని తీసుకెళ్లి ఉండవచ్చనే చర్చ సాగుతోంది. దీనిపై ఎస్‌హెచ్‌వో బండారి రాజును వివరణ కోరగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


